ఫ్యాషన్ రంగం.. అవకాశాలు అపారం
గెస్ట్ కాలమ్
ఫ్యాషన్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి ఉండాల్సిన లక్షణాలపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)-హైదరాబాద్ డెరైక్టర్, డాక్టర్ ఎన్.జె. రాజారామ్. భవితకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు..
ఫ్యాషన్ హబ్:
ఫ్యాషన్ ప్రపంచంలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉంది. నిఫ్ట్ కేంద్రాల్లో హైదరాబాద్ క్యాంపస్ది ప్రముఖ స్థానం. దీంతో హైదరాబాద్ క్యాంపస్‌లో చేరేందుకు అధిక శాతం యువత ఆసక్తిచూపుతుంటారు. ఈ క్యాంపస్‌లో యూజీ, పీజీ కోర్సులతోపాటు యువతులు, గృహిణులకు ఉపయోగపడేలా ప్రత్యేక కోర్సులను కూడా నిర్వహిస్తున్నాం.
ఆలోచనాధోరణి మారాలి:
చదువంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ అనే ధోరణి మారాలి. మారుతున్న అవసరాలకనుగుణంగా విద్య, ఉపాధి అవకాశాల్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అలా వచ్చిన రంగమే ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ రంగంలో మన మార్కెట్‌కు డిమాండ్ క్రమేణా పెరుగుతోంది. మన దేశం నుంచి 20 బిలియన్ల ఫ్యాషన్ ఎగుమతులు జరుగుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో టెక్స్టైల్స్ రంగం శర వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఈ రంగంలో మన దేశంలో విసృత స్థాయిలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనా, సింగపూర్, జపాన్ తదితర దేశాల్లో కూడా ఫ్యాషన్ నిపుణులకు చక్కని డిమాండ్ ఉంది.
డిజైన్ ఒక్కటే కాదు:
ఫ్యాషన్ కోర్సులు అంటే.. కేవలం దుస్తులను డిజైన్ చేయటం ఒక్కటే అనే భావన ఉంది. వాస్తవానికి.. మార్కెట్లోకి విడుదల చేసే నూతన డిజైన్లు పోటీని తట్టుకుని నిలవాలంటే.. వాటికంటూ ఎటువంటి ప్రత్యేకత ఉండాలి? ఈ క్రమంలో సృజనాత్మకతను జోడించి వినూత్నమైన ఆలోచనలకు రూపమివ్వటం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆభరణాలు, హస్తకళా వస్తువులకు రూపమిచ్చే విధంగా కూడా శిక్షణ ఉంటుంది.
యూజీ-పీజీ:
ఫ్యాషన్ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి సృజనాత్మకత.. కళల పట్ల అభిరుచి ఉండాలి. నిఫ్ట్‌లో డిజైనింగ్, ఇంటీరియర్, అపెరల్ తదితర విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. యూజీ కోర్సులకు అర్హత ఇంటర్మీడియెట్. రాతపరీక్ష, ఆప్టిట్యూడ్, సృజనాత్మకత అంశాల్లో నిర్వహించే పరీక్షల ఆధారంగా ప్రవేశం ఉంటుంది, పీజీ కోర్సులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ దశలుంటాయి. వీటిలో ప్రవాస భారతీయు (ఎన్ఆర్ఐ)లకు ప్రతి విభాగంలో ఐదు సీట్లు ఉన్నాయి. ఫీజు సెమిస్టర్‌కు రూ. 81 వేలు. ఎన్ఆర్ఐలకు రూ. 4.75 లక్షలు. అర్హులైన విద్యార్థులు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది.
సంప్రదాయానికి ఆధునికత:
ఎంతటి కళా నైపుణ్యం ఉన్నప్పటికీ దానికి ఆధునికతను జోడిస్తే తప్ప మార్కెట్లో నిలదొక్కుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ భారతీయ సంప్రదాయానికి ఆధునికతను జోడించేలా శిక్షణ ఉంటుంది. తరగతి గదికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా ఐదారు నెలలు ప్రాజెక్టు వర్క్ చేయాలి.
అందులో భాగంగా వారసత్వంగా సంక్రమించిన హస్తకళలే జీవనాధారంగా సాగుతున్న.. ఏటికొప్పాక, కొండపల్లి, మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడి కళాకారులకు ఆధునికతపై అవగాహన కల్పిస్తారు. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా విదేశాల్లో జరిగే ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశం కూడా నిఫ్ట్ విద్యార్థులకు ఉంది. ఈ ఏడాది జపాన్‌లో నిర్వహించిన యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు మన దేశం నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైతే.. వారిలో ఇద్దరు హైదరాబాద్ నిఫ్ట్ విద్యార్థులే కావడం విశేషం.
ప్రత్యేక కోర్సులు:
ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్, ఫ్యాబ్రిక్స్ మహిళలు ఆసక్తి చూపే రంగాలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిఫ్ట్‌లో ప్రత్యేకంగా గార్మెంట్స్ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైనింగ్, లేడీ వేర్ వంటి మూడు కోర్సులు నిర్వహిస్తున్నాం. వీటికి మంచి స్పందన లభిస్తోంది. కిచెన్, బెడ్ రూమ్, లివింగ్ రూమ్.. ఇలా మొత్తంగా ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు.. కావాల్సిన అంశాల కలయికగా కోర్సులను అందించడంతోపాటు వృథా వస్తువులనూ సద్వినియోగం చేసేలా కూడా శిక్షణను ఇవ్వాలని యోచిస్తున్నాం.
అవకాశాలు అనేకం:
ప్రపంచీకరణ కారణంగా అనుకరణ పెరుగుతోంది. డిజైనర్ దుస్తుల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. సినిమాలు, సీరియల్స్ల్లో నటీనటుల వస్త్రాలంకరణలో డిజైనర్లూ కీలకంగా మారారు. కార్పొరేట్ స్కూల్స్ కూడా తమ యూనిఫామ్ డిజైన్ కోసం సంబంధిత నిపుణులను ఆశ్రయిస్తున్నాయి. షాపింగ్‌మాల్స్.. డ్రెస్ కౌన్సిలర్లుగా డిజైనర్లను నియమించుకుంటున్నాయి. ఈనేపథ్యంలో డిజైనర్లకు అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. స్వయం ఉపాధి దిశగా ఆలోచన ఉంటే సొంతంగా బొటిక్, డిజైన్ స్టూడియో ఏర్పాటు చేసుకోవచ్చు.
రిమైండర్స్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా-రూర్కెలా
వివిధ విభాగాల్లో 231 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 29, 2013
వెబ్సైట్: http://sail.shine.com
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్‌కార్పొరేషన్
ట్రైనీ ఇంజనీర్ పోస్టులు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 11, 2013
వెబ్సైట్: www.nhpcindia.com
సెంట్రల్ కోల్ ఫీల్డ్స్
వివిధ విభాగాల్లో 1427 పోస్టులు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2013
వెబ్సైట్: http://ccl.gov.in
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29, 2013
వెబ్సైట్: http://indianarmy.nic.in/
ఐఐఐటీ-హైదరాబాద్
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ విభాగాల్లో రీసెర్చ్ కోర్సులు
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 25, 2013.
వెబ్సైట్: http://admissions.iiit.ac.in
బిట్స్-పిలానీ
కోర్సు: ఎంబీఏ
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2014.
వెబ్సైట్: www.bitsadmission.com