loud sounds
-
భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు?
కొట్టాయం: భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు? వారం రోజుల వ్యవధిలోనే కేరళలో పలు గ్రామాల్లో భూగర్భం నుంచి గంభీరమైన వింత శబ్దాలు రావడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కొట్టాయం జిల్లాలోని చెనప్పాడి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున భూమిలో నుంచి ఏవో వింత శబ్దాలు వచ్చాయి. ఆ గంభీరమైన శబ్దాలను విని గ్రామ ప్రజలు భయాందోళలకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఏవో గంభీరమైన శబ్దాలు భూగర్భం నుంచి వినిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్ధాలు గట్టిగా ఉన్నాయని స్థానికులు అన్నారు. బయట వాతావరణంలో ఎలాంటి మార్పులేవీ కనిపింలేదని చెప్పారు. రెండు సార్లు భీకరంగా శబ్దాలు వచ్చాయని పేర్కొన్నారు. ఆ గ్రామాన్ని పరిశీలిస్తామని కేరళ మైనింగ్, జియాలజీ శాఖ అధికారులు చెప్పారు. గత వారం ఆ జిల్లాలో వినిపించిన శబ్దాలను ఇప్పటికే పరిశీలించామని చెప్పారు. అయినప్పటికీ మళ్లీ ఓ సారి అధికారులను పంపిస్తామని వెల్లడించారు. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రీయ అధ్యయనం మాత్రమే ఈ శబ్దాలకు గల కారణాన్ని శాస్త్రీయంగా తెలపగలదని చెప్పారు. చదవండి:'ముస్లీం లీగ్ లౌకిక పార్టీ' రాహుల్ వ్యాఖ్యలపై.. బీజేపీ ఫైర్.. -
భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’
బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సమీప ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ శబ్దం వినిపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ శబ్దం ముఖ్యంగా బిదాది ప్రాంతం నుంచి వెలువడినట్లు.. బాంబు పేలినప్పుడు ఎంత భారీ శబ్దం వినిపిస్తోందో.. అలాంటి సౌండే వినిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ బారీ శబ్దం వల్ల జనాలు తీవ్ర ఆందోళనకు, గందరగోళానికి గురయ్యారు. భూకంపం వచ్చిందా.. లేక ఎక్కడైనా భారీ పేలుడు సంభవించిందా అంటూ నెటిజనులు సోషల్ మీడియాలో ప్రశ్నల మోత మోగించారు. ఇక ఈ వింత శబ్దంపై కర్ణాటక పోలీసులు స్పందించారు. బెంగళూరు, దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు సంభవించలేదని తెలిపారు. అలానే రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం భారీ శబ్దం వినిపించిందని పేర్కొంటున్న ప్రాంతాల్లో ఎలాంటి భూకంపం చోటు చేసుకోలేదని.. అలానే భూమి పొరల్లో కూడా ఎక్కడా.. ఎలాంటి మార్పులు జరగలేదని తెలిపారు. (చదవండి: కర్ణాటక: ఆ ప్రాంతం మరో గోవా కానుంది..) ‘‘అంతేకాక భారీ శబ్దం వినిపించింది అంటున్న సమయంలో ఏదైనా భూకంప సంకేతాలు వెలువడ్డాయా లేదా అని తెలుసుకోవడం కోసం భూకంప పరిశీలనల కేంద్రం డేటాను విశ్లేషించడం జరగింది. సీస్మోగ్రాఫ్‌లు స్థానికంగా ఎలాంటి ప్రకంపనలు, భూకంపం సంకేతాలను చూపించలేదు’’ అని అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మరీ ఈ శబ్దం ఎక్కడ నుంచి వెలువడింది.. దానికి కారణం ఏంటనే దాని గురించి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. (చదవండి: భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ) ఇక 2021, జూలై 2న బెంగళూరులో ఇదే తరహా శబ్దం వినిపించింది. బెంగళూరులో జూలై 2న కూడా ఇదే విధమైన ధ్వని వినిపించింది, ఇది ధ్వని వేగం కంటే వేగంగా వెళ్లినప్పుడు జెట్ విమానం నుంచి వెలువడే సోనిక్ బూమ్ అని భావించారు. బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాలను పరీక్షించే సమయంలో ఈ శబ్దం వెలువడినట్లు భావించారు. అయితే భారత వైమానిక దళం సోనిక్ బూమ్ వాదనను ఖండించింది. మరోసారి ఇదే తరహా శబ్దం వినిపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: పడిలేచిన పట్టణం.. ఇక్కడికి వెళ్తే యూరప్ చూసినట్లే! -
ఉలిక్కిపడ్డ బెంగళూరు.. పలు ప్రాంతాల్లో భారీ శబ్దం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ శబ్దం వినిపించింది. దీంతో బెంగళూరు నగర వాసులు ఉలిక్కిపడ్డారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వినిపించిన ఈ భారీ శబ్దం ధాటికి పలు నివాసాల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. హెచ్ఎస్ఆర్ లే అవుట్, మహదేవపుర, సిల్క్‌బోర్డ్, మడివాల, బొమ్మనహళ్లి, కొత్తనూరు, అగర, హుళిమావు, అనేకల్, పద్మానభ నగర్ వంటి పలు ప్రాంతాల్లో ఈ శబ్దం వినిపించింది. ఈ శబ్దానికి గల కారణాలపై బెంగళూరు పోలీసుల ఆరాతీస్తున్నారు. అయితే ఈ శబ్దం గత సంవత్సరం సోనిక్ బూమ్‌ను గుర్తుచేస్తోంది. 2020 మేలో కూడా బెంగళూరు అంతటా ఒక్కసారిగా భారీ శబ్దంలు వినిపించిన విషయం తెలిసిందే. ఇది మరొక సోనిక్ బూమ్ అని బెంగళూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ శబ్దంపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. తమ విమానాలు ఇలాంటి శబ్దాలు చేయలేదని స్పష్టం చేసింది. -
టపాసుల గోడౌన్లో అగ్ని ప్రమాదం
అబిడ్స్/దత్తాత్రేయనగర్: బేగంబజార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫీల్‌ఖానా నింబూ మార్కెట్ ఎదురుగా ఉన్న టపాసుల గోడౌన్లో శనివారం మధ్యాహ్నం భారీ మంటలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దుకాణ యజమాని టపాకాయలు విక్రయిస్తుండగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే భారీ శబ్దాలు రావడంతో స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులు పరుగులు పెట్టారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు రెండో, మూడో అంతస్తుల్లోని టాయిస్ గోడౌన్‌లోకి విస్తరించాయి. తోటి వ్యాపారులు దుకాణాలను మూసేసి మంటలు ఆర్పేందుకు సహకరించారు. లెసైన్ ్సలతోనే... శ్రీనివాస ఏజెన్సీ పేరిట రమేష్ గుప్తా చెన్నై ఎక్స్‌ప్లోజివ్ శాఖ లెసైన్స్‌తో టపాసుల హోల్‌సేల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. మొదటి అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ పెట్టడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఇనుప బక్కెట్లు, నీరు, మంటలు ఆర్పే పరికరాలు లేకపోవడంతో ఫైరింజన్లు వచ్చేవరకు మంటలు అదుపులోకి రాలేదు. దాదాపు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. యజమానిపై కఠిన చర్యలు - డీసీపీ దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి మంటలను ఆర్పేందుకు సహకరించిన వ్యాపారులు, స్థానికులను ఆయన ప్రశంసించారు. టపాకాయల దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైదానాల్లోనే తాత్కాలిక టపాకాయల దుకాణాలకు అనుమతిస్తామన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతి ఎలా వచ్చిందో పూర్తి విచారణ చేపడతామన్నారు. రమేష్ గుప్తా పై కేసు నమోదుచేసినట్లు డీసీపీ తెలిపారు. నిబంధనలు పాటించండి-ఫైర్ అధికారి టపాసుల దుకాణాల వారు నిబంధనలు పాటించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ అసిస్టెంట్ ఫైర్ అధికారి ఎం.భగవాన్‌రెడ్డి పేర్కొన్నారు. సమాచారం అందింన వెంటనే ఆరు ఫైరింజన్లను రప్పించామన్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పినట్లు వివరించారు. సంఘటనలు ఎన్నెన్నో... ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో టపాసుల దుకాణాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2002లో ఉస్మాన్‌గంజ్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. ఐదేళ్ల క్రితం గోషామహాల్ చందన్‌వాడీలో ఓ ఇంట్లో టపాకాయలు తయారు చేస్తుండగా నలుగురు మృతి చెందారు. అలాగే మూడేళ్ల క్రితం బేగంబజార్ ఛత్రీ ప్రాంతంలోని హోల్‌సేల్ దుకాణంలో మంటలు చెలరేగి టపాకాయలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శాంతి ఫైర్ వర్క్స్ ఘటన సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు పలు ప్రకటనలు చేసినా అవి నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో వ్యాపారం.. అనుమతులు చెన్నైలో.. టపాకాయల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెన్నైలో ఎక్స్‌ప్లోజివ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఈ అనుమతి ఉంటేనే హోల్‌సేల్ దుకాణాలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ శాఖ అనుమతి సునాయాసంగా తీసుకువస్తున్న కొంతమంది, జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీ ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.