పాలు తాగే కదా ఇంతవాళ్లమయ్యాం!
నలుగురిలో ఉన్నప్పుడు స్త్రీ తన వ్యక్తిగత అవసరాలను, అత్యవసరాలను బలవంతంగా అదిమిపెట్టుకోగలిగినంత ‘శక్తిమంతురాలు’ అయితే కావచ్చు కానీ, పాలకోసం అలమటిస్తున్న బిడ్డ ఆకలి తీర్చే విషయంలో తల్లిగా పరిసరాలను పట్టించుకోనంత ‘బలహీనురాలు’ ఆమె. ఆ బలహీనతకు మరో పేరే తల్లి హృదయం. అయితే లండన్‌లోని అతి పెద్ద హోటళ్లలో ఒకటైన క్లారిట్డెజ్ హోటల్ యాజమాన్యం ఆ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయింది! లూయీ బర్న్స్ అనే ముప్పై ఐదేళ్ల మహిళ తన మూడు నెలల కూతురు ఇసాడోరాకు వరండాలో అందరిముందూ స్తన్యం పట్టడాన్ని తప్పు పట్టింది. ‘‘బిడ్డ తలపై నుంచి నేప్కిన్ కప్పి పాలివ్వొచ్చు కదా’’ అని సలహా కూడా ఇచ్చింది.
గత సోమవారం తేనీటిని సేవించే మధ్యాహ్నపు విరామ సమయంలో ఒడిలోని పసికందు ఆపకుండా ఏడుస్తుండంతో పక్కన ఉన్నవారిని పట్టించుకోకుండా పాపకు పాలు పట్టింది. అదే లూయీ చేసిన పాపం! హోటల్ తీరుపై లూయీ ఎంతగానో నొచ్చుకున్నారు. ఈ విషయం మీడియా వరకు వెళ్లింది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఆ తల్లి చేసిన దానిలో తప్పేమీ లేదనీ, పైగా ఆది మహిళల హక్కు అని ప్రకటించడంతో ఇప్పుడక్కడ.. ‘బహిరంగ స్థలాలలో స్తన్యమివ్వడం సబబా కాదా’ అన్న చర్చ మొదలైంది.
బిడ్డల తల్లులంతా లూయీ బర్న్స్‌ను సమర్థించారు. వారిలో పదిహేను మంది లూయీతో కలిసి వచ్చి, ఆమెను ఈసడించుకున్న క్లారిట్డెజ్ హోటల్ బయట తమ బిడ్డలకు బహిరంగంగా స్తన్యం పడుతూ నిరసన తెలిపారు. బ్యానర్లు ప్రదర్శించారు. ‘‘అవి ఉన్నది అందుకేరా స్టుపిడ్’’ అని ఒక బ్యానర్లో రాసి ఉంది. దీన్ని బట్టి తల్లుల మనసు ఎంత గాయపడిందో అర్థం చేసుకోవచ్చు.
బ్రిటన్‌లోని సమానత్వ చట్టాల ప్రకారం... స్తన్యమిస్తున్న తల్లికి వ్యతిరేకంగా మాట్లాడ్డం కూడా లైంగిక వివక్ష కిందికే వస్తుంది. అయినా, ఇలాంటి విషయాలను చట్టం చెబితే తప్ప తెలుసుకోలేనంత అనాగరికంగా ఉన్నామా మనమింకా! పాలు తాగే కదా ఇంతవాళ్ల మయ్యాం.