కళ్లు మూసి కలిపి చదువుకో ఒక్కసారి!
హృదయం: ‘రాళ్లల్లో ఇసుకల్లో రాశామూ ఇద్దరి పేర్లు.. కళ్లు మూసి కలిపి చదువుకో ఒక్కసారి... ’అంటూ సినీ కవి ఒకరు చిన్ననాటి బంధంలోని అందం గురించి చెప్పాడు. ఇలా మన దగ్గరే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా రాళ్లల్లో ఇసకల్లో ఇద్దరి పేర్లూ రాసుకొని ఆనందించే జంటలు ఉంటాయి. అలాంటి రాతలే ఆమె జీవితానికి గొప్ప జ్ఞాపకంగా మారాయి. తోడు దూరం అయ్యాక కూడా ఊరటనిచ్చే అనురాగపు పరిమళాలు అయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆ కథ ఏమిటి?
నిద్రలేని రాత్రులు.. చెమ్మగిల్లిన నేత్రాలు.. ఒంటరితన ం... హృదయం బరువెక్కిన క్షణాలు... అలాంటి ఏకాంతపు ద్వీపంలో బతుకు ఆమెది. ప్రాణంగా ప్రేమించిన భర్త దూరం అయ్యాడు. ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయాడు. అతడు భర్త మాత్రమే కాదు, ఆమెప్రాణం కూడా. అమెరికాలోని సౌత్కరోలినాకు చెందిన ఆమె పేరు సిస్సీహెవిట్. భర్త డేవిడ్ హెవిట్. 12 యేళ్ల వయసు నుంచే అతడితో ఆమెకు అనుబంధం! డేటింగ్‌తో మొదలై 34 యేళ్ల పాటు దాంపత్య జీవితాన్ని పంచుకొన్నారిద్దరూ. అయితే ఆరేళ్ల కిందట అతడి హఠాన్మరణం ఆమెను కుంగదీసింది.
‘ఇక బతకడం అనవసరం. అతడు లేని జీవితానికి అర్థమే లేదు. అతడితో కలిసి జీవించడంతోనే ఈ జీవితానికి పరిపూర్ణత వచ్చింది. ఇక అతడే లేనప్పుడు బతకడం ఎందుకంటూ..’ ఆత్మహత్యకు కూడా సిద్ధం అయ్యింది. సరిగ్గా ఆ సమయంలో అతడితో గడిపిన క్షణాలను వెదుక్కొంటూ వెళుతున్న ఆమెకు.. భౌతిక రూపంలో లభించిన ఒక జ్ఞాపకం జీవితంపై కొత్త ఆశలను రేకెత్తించింది. అతడి మధుర జ్ఞాపకంగా కనిపించిన ఆ ‘కానుక’ ఒక సిమెంటు పలక. ఆ పలకతో ఆమె తొలి ప్రేమ జ్ఞాపకం ముడిపడి ఉంది. పన్నెండోయేటే డేటింగ్ మొదలు పెట్టిన ఈ జంట అప్పట్లోనే పక్షుల జంటలా విహరించింది. ఆ విహారంలో తమ ప్రేమకు గుర్తుగా కొన్ని చోట్ల తమ పేర్లను రాసింది. ఆ సమయంలోనే ‘డేవిడ్+సిస్సీ’ అంటూ ఒక చోట సిమెంట్ పలకపై రాశారు. అయితే ఆ తర్వాత దాని గురించి మరిచిపోయారు. డేవిడ్ ఉన్నన్ని రోజులూ ఆమె వర్తమానంలోనే బతికింది.
గతాన్ని తలుచుకోవాల్సిన అవసరం, భవిష్యత్తు గురించి భయపడాల్సిన అగత్యం లేకుండా ప్రేమను పంచాడతను. అలాంటి మనిషి ఒక్కసారిగా దూరం కావడంతో కుంగిపోతున్న ఆమెకు అనుకోకుండా కనిపించిన తమ టీనేజీ నాటి ఆ సిమెంట్ పలకపై ఉన్న పేర్లు అపురూపంగా కనిపించాయి. ఆ పేర్లు ఆమెను నవయవ్వన ప్రాయంలోకి తీసుకెళ్లి తొలి ప్రేమ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాయి. తనకు దూరమైన భర్తకు సంబంధించిన అరుదైన జ్ఞాపకంగా మారాయి. నలభై యేళ్ల కిందట తమ ప్రేమ కావ్యానికి ఆనవాళ్లుగా ఉన్న వాటిని ఇప్పుడు అపురూపంగా అందరికీ చూపించుకొంటూ ఆనందిస్తోందామె. ఈ రుజువు చాలు మరణించినా అతడు తన ప్రేమతో ఆమెను సంతోషంగా బతికిస్తున్నాడనడానికి.
ప్రేమ బంధానికి లాక్ వేస్తున్నారు!
పరిస్థితుల కారణంగా తాము ఎక్కడ విడిపోతామో అనే భయం అనేక మంది ప్రేమికుల్లో ఉంటుంది. అలాంటి భయం ఉన్నప్పుడు తమ ప్రేమ శాశ్వతం కావాలనీ, ఒక బంధంగా జీవితాంతం కొనసాగాలనీ కోరుకోవడమూ సహజమే. ఆ కోరిక ప్రపంచమంతా ఒకే విధంగా ఉంటుందనడానికి రుజువు ‘లవ్ లాక్స్’. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న గ్రిల్స్‌కు తాళం వేసి, లాక్ వేశామంటే తమ ప్రేమ అమరం అవుతుందని అక్కడి ప్రేమికుల నమ్మకం. అందుకే యేటా కొన్ని వందల, వేల జంటలు లాక్కు ఇరువైపులా తమ పేర్లను రాసి ఆ బ్రిడ్జిక్ వేస్తూ ఉంటారు. అయితే ఇలా లాక్వేసే వాళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటంతో పారిస్ నగరాభివృద్ధి వాళ్లకు బాగా ఇబ్బందిగా మారింది. వాటిని తీసేస్తే ప్రేమికులు హర్ట్ అవుతారు, తీసి వేయకపోతే ఇలాగే పెరుగుతూ పోతాయి. దీంతో ఈ లాక్‌ల విషయంపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అక్కడి అధికారులు.