అసలు ప్రేమికులే లేకపోతే..
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతంపై విభిన్న కథనాలు వివాదాన్ని సృష్టిస్తోంటే, బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ రాఖీ సావంత్ తనదైన శైలిలో స్పందించింది. ప్రత్యూష బెనర్జీ , ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ప్రేమ వ్యవహారంలోనే ఎక్కువ కలత చెందేదని ఆమె తెలిపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని రాఖీ పేర్కొంది. ప్రేమలు ప్రాణాలు తీస్తున్నాయని, ప్రేమికులు లేనిదే బతకలేరా అని ఆమె వ్యాఖ్యానించింది. అసలు ప్రేమికులే లేకపోతే ఈ ఆత్మహత్యలే ఉండవని రాఖీ చెప్పుకొచ్చింది.
ఇటీవల తాను ప్రత్యుషను కలిసినపుడు చాలా ఆందోళనలో ఉన్నట్టు కనిపించిందని రాఖీ సావంత్ తెలిపింది. ప్రత్యూష చాలా ఎమోషనల్ గర్ల్ అని, అందుకే ఏమైంది తను అడగ్గానే కన్నీళ్లు పెట్టుకుందని, ఆమెకు జీవితంలో ఎన్నో కలలు ఉన్నాయని పేర్కొంది. రాహుల్ మాజీ ప్రియురాలు సలోని విషయంలో కలత చెందేదని చెప్పింది. రాహుల్ ...సలోనితో రిలేషన్ కొనసాగిస్తున్నాడని ప్రత్యుష బాధపడిందని, ఆమెకు పని విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, కేవలం ప్రేమ వ్యవహారమే ఆమెను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని అభిప్రాయపడింది. రాహుల్ ని పిచ్చిగా ప్రేమించింది.. అతను లేకపోతే బతకలేనని కన్నీళ్లతో చెప్పిందని తెలిపింది. ముంబై పోలీసులు ఈ కేసును ఎలా విచారిస్తారో చూద్దాం అని మీడియాకు తెలిపింది.
మరోవైపు ప్రత్యూష సన్నిహితుడు, ప్రముఖ డిజైనర్ రోహిత్ వర్మ మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు. గత నెలలో పెళ్లి దుస్తులు తయారు చేయాల్సిందిగా ప్రత్యూష తనను కోరిందని తెలిపాడు. తనను హోలీ పార్టీకి ఆహ్వానించిందని, అయితే ఆ సమయంలో తాను లండన్ లో ఉండడం రాలేకపోయానని రోహిత్ పేర్కొన్నాడు.