పెళ్లిమండపంలో ప్రియుడిని కిడ్నాప్ చేసి..
ఏకంగా పెళ్లి మండపం నుంచి ప్రియుడిని కిడ్నాప్ చేసి.. చివరకు అతన్నే పెళ్లి చేసుకున్న ఓ 'రివాల్వర్ రాణి' ప్రేమకథ ఇది. అనేక మలుపుల తర్వాత ఆమె ప్రేమకథ సుఖాంతమైంది. ఇంతకు ఈ రివాల్వర్ రాణి ఎవరు? ఆమె ప్రేమకథ ఏమిటంటే..
వర్ష సాహు అలియాస్ 'రివాల్వర్ రాణి'.. రెండు నెలల కిందట ఈమె పేరు మీడియాలో మార్మోగిపోయింది. అందుకు కారణం తన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా.. ఏకంగా తుపాకీతో బెదిరించి అతన్ని పెళ్లిమండపం నుంచే వర్ష సాహు కిడ్నాప్ చేసింది. మే 15న ఉత్తరప్రదేశ్ బుందేల్‌ఖండ్‌లోని మౌదాహాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వర్ష సాహు-అశోక్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటంతో వర్ష ఈ సాహసానికి ఒడిగట్టింది. తుపాకీతో బెదిరించి మరీ పెళ్లి కొడుకును పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన అశోక్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఇంతలో తమ కూతురిని పెళ్లి పేరిట మోసం చేశాడంటూ అశోక్‌పై పెళ్లికూతురు కుటుంబసభ్యులు కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అశోక్ ఈ నెల 7న జైలు నుంచి విడులయ్యాడు. జైలు బయట అతనికి ఘనస్వాగతం పలికిన వర్ష అతన్నే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. హమిర్‌పూర్‌లోని మతా చౌరా ఆలయంలో వీరి పెళ్లి ఈ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి భోజనాలు సహా అన్ని ఏర్పాట్లను యూపీ శివసేన శాఖ దగ్గరుండి చేయించడం గమనార్హం. అంతేకాదు ప్రేమికులు మోసం చేసే యువతులను ఆదుకునేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేయనున్నట్టు యూపీ శివసేన అధ్యక్షుడు రతన్ బ్రహ్మచారి ప్రకటించారు.