ఢిల్లీ హత్యోదంతం.. ఆ ఒక్క అబద్దమే అతడ్ని పట్టించింది..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రియుడే ప్రేయసిని ముక్కముక్కలుగా చేసిన ఢిల్లీ మెహ్రౌలీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య జరిగిన దాదాపు ఆరు నెలల అనంతరం నిందితుడు అఫ్తాబ్ ఆమిన్ పూనావాలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విచారణ ఎలా జరిగింది? ఒక్క అబద్ద అఫ్తాబ్‌ను ఎలా పట్టించిందనే విషయాలను పోలీసులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం..
► ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన అనంతరం తనపై అనుమానం రాకుండా.. ఆమె ఇన్స్టాగ్రాం అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్‌తో ఇఫ్తాబ్ చాట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇలా చేస్తే శ్రద్ధ చనిపోయిందని ఆమె స్నేహితులకు అనుమానం రాదని అతను భావించాడని చెప్పారు. అంతేకాదు మొబైల్ యాప్‌లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు కూడా చేశాడని వివరించారు.
► శ్రద్ధ కన్పించడం లేదని ఆమె తండ్రి ముంబై వాసాయ్ పోలీస్ స్టేషన్లో గతనెలలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26న పోలీసులు అఫ్తాబ్‌ను విచారణకు పిలిచారు. అయితే శ్రద్ధ మే 22నే ఢిల్లీ మెహ్రౌలిలో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్లిపోయిందని అఫ్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు, ఇతర వస్తువులు ఫ్లాట్‌లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతో పాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదన్నాడు.
కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే(మే 18) ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరూ ఢిల్లీ మెహ్రౌలీ ఫ్లాట్‌కు మారి రెండు వారాలే అయింది.
► అయితే అఫ్తాబ్‌ను విచారించిన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రౌలీలోనే ఉన్నట్లు తేలింది. అంతేకాదు శ్రద్ధ ఖాతా నుంచి అఫ్తాబ్‌కు రూ.54వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి.
► దీంతో పోలీసులకు అఫ్తాబ్‌పై మరోసారి అనుమానం వచ్చింది. వెంటనే అతడ్ని మళ్లీ విచారణకు పిలిచారు. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా తానే కడతానని, ఆమె పాస్వర్డ్లు, ఖాతా వివరాలు తనకు తెలుసునని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. తానే యాప్ ద్వారా శ్రద్ధ ఖాతా నుంచి తన ఖాతాలోకి డబ్బు పంపించుకున్నట్లు వివరించాడు.
► అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్స్టాగ్రాం చాట్‌ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్‌తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మొహ్రౌలీలోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మే 22నే వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రౌలీలోనే ఎలా ఉందని ప్రశ్నించారు.
► అప్పుడు అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు అఫ్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్లు భయానక నిజాన్ని చెప్పాడు. ఒక్కో పార్ట్‌ను ఒక్కోరోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు.
► శ్రద్ధ తల్లిదండ్రులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసినప్పటి నుంచి ఆగ్రహంతో ఆమెకు దూరంగా ఉన్నారు. ఎక్కడుంది? ఎలా ఉంది? అనే బాగోగులు పట్టించుకోలేదు. అయితే గత నెలలో ఆమె స్నేహితులకు కూడా శ్రద్ధ టచ్‌లో లేదని తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పుడే అసలు విషయం వెలుగుచూసింది.
► శ్రద్ధ, అఫ్తాబ్ ఇద్దరూ ముంబై వాసాయ్ ప్రాంతానికి చెందినవారే. 2019లో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ ఏదాది మే లోనే ఢిల్లీకి మకాం మార్చారు. అయితే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో అఫ్తాబ్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఈ సమయంలో వేరే అమ్మాయిలను కూడా ఫ్లాట్‌కు పిలిచి డేటింగ్ చేశాడు.
చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో..