Lover protests
-
ప్రియుడు ఎక్కడ..?
అన్నానగర్ : కళ్లకురిచ్చి సమీపంలో వివాహం చేసుకోవడానికి వ్యతిరేక తెలిపిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టడంతో స్థానికంగా కలకలం ఏర్పడింది. కళ్లకుర్చి జిల్లా తిరుకోవిల్ సమీపం వసంత కృష్ణాపురానికి చెందిన పన్నీర్ సెల్వం కుమార్తె అన్భరసి. ఈమె చెన్నై లో ఉంటూ పనిచేస్తూ వచ్చింది. ఈమె అదే ప్రాంతానికి చెందిన మారిముత్తు కుమారుడు విశ్వనాథన్‌ను ప్రేమించింది. వీరిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మూడు నెలలగా తనను వివాహం చేసుకోమని విశ్వనాథన్‌ను ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కానీ అతను వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. దీనిపై 20 రోజులకు ముందు విల్లుపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బుధవారం అదే ప్రాంతంలో ఉన్న తన ప్రియుడు విశ్వనాథన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రియుడు ఎక్కడ..? అని రాసిన పలకను చేతిలో పెట్టుకుని ధర్నాలో నిమగ్నమయ్యింది. ప్రియుడితో పెళ్లిజరిపించాలని కోరింది. దీనిపై సమాచారం అందుకున్న అరకొండనల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్భరసి, ఆమె బంధువులతో మాట్లాడారు. ప్రియుడిని కలిపే విధంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. అనంతరం ప్రియురాలు, ఆమె బంధువులు శాంతించారు. -
ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు మౌన దీక్ష
కృష్ణాజిల్లా , ఇబ్రహీంపట్నం (మైలవరం): పెళ్లి చేసుకుంటానని ప్రేమించి చివరకు మోసం చేసిన ప్రియుడి ఇంటిముందు ఓ ప్రియురాలు మౌన దీక్షకు దిగింది. కిలేశపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు అనేక వివరాలు వెల్లడించారు. కిలేశపురం గ్రామానికి చెందిన జోసఫ్‌రాజు ఎన్టీటీపీఎస్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇబ్రహీంపట్నంలో బ్యూటీపార్లర్ నడుపుతున్న బాధితురాలు భాగ్యలక్ష్మితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. పెళ్లి పేరు ఎత్తగానే అతను ముఖం చాటేసినట్లు బాధితురాలు చెబుతోంది. 2018 నవంబర్‌లో జోసఫ్‌రాజు నమ్మించి మోసం చేశాడని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అప్పట్లో టీడీపీ నాయకులు జోసఫ్ తరఫున వకాల్తా పుచ్చుకుని కేసును నీరుగార్చారు. కొంతకాలం దూరంగా ఉన్న ఇరువురు మరలా స్నేహం చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోసఫ్‌కు వివాహం అని తెలుసుకున్న భాగ్యలక్ష్మి ప్రియుడి ఇంటికి వచ్చేసింది. విషయాన్ని నలుగురికి చెప్పుకుని ప్రాధేయపడింది. అయితే ప్రియుడి తరఫు బంధువులు ఇంటి వద్ద లేకపోవటంతో అక్కడే బైఠాయించింది. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన భాగ్యలక్ష్మి ,మీడియాతో మాట్లాడుతున్న భాగ్యలక్ష్మి నమ్మి ప్రేమిస్తే మోసం చేశాడని ఆరోపించింది. కేసు తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో జోసఫ్‌రాజుకు 2018లోనే వివాహం అయ్యిందని జోసఫ్ తండ్రి శామ్యూల్ చెబుతున్నాడు. అందుకు అవసరమైన వివాహం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పోలీసులకు చూపిస్తున్నాడు. భాగ్యలక్ష్మితో తమ అబ్బాయికి ఉన్న సంబంధంపై గతంలో కేసు పెట్టినప్పుడే రాజీ చేసుకున్నామని చెబుతున్నాడు. అయితే అవన్నీ కట్టుకథలని జోసఫ్‌కు రెండు రోజుల క్రితమే వివాహం అయ్యిందని బాధితురాలు చెబుతోంది. అతనితోనే తనకు వివాహం జరిపించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా, దీనిపై సీఐ దుర్గారావును వివరణ కోరగా జోసఫ్‌రాజుపై 2018లోనే కేసు నమోదు చేశామని, అది కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. -
పెళ్లి కోసం ప్రియుడి ఇంటి ముందు వంటావార్పు
సముద్రాల ప్రధాన రహదారిపై ధర్నా ‘ఈటెల’ హామీతో ఆందోళన విరమణ కోహెడ : నమ్మించి గర్భవతిని చేసిన ప్రియుడు పిల్లి శ్రీ కాంత్‌తో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని కోహెడ మండలం సముద్రాలలో ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన ఉప్పరపల్లి రజిని రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించింది. ఆమెకు శనివారం కూడా మహిళా సంఘాలు, గ్రామస్తులు సంపూర్ణ మద్ద తు ప్రకటించి శ్రీకాంత్ ఇంటి ఎదుట వంటావార్పు ని ర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎస్సై సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలికి న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని కోరినా ప్రయోజనం లేకుండాపోయింది. అదే సమయంలో సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వైపు హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెళ్తున్నారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో ఆయన వచ్చి రజినితో మాట్లాడారు. డీఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే కేసును రాజకీయ ఒత్తిడితో పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని, శ్రీకాంత్‌తో తన పెళ్లి జరిగే వరకూ పోరాడుతూనే ఉంటానని రజిని స్పష్టం చేసింది. రజినికి మద్దతు తెలిపిన వారిలో మహిళా సంఘాల ప్రతినిధులు గూడెం లక్ష్మి, వనజ, సర్పంచ్ బొల్లం రవి, గ్రామస్తులు ఉన్నారు. -
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ...
-
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని ...
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. గర్భవతిని చేశాక.. పెళ్లి మాట ఎత్తేసరికి ఊరు విడిచి వెళ్లాడో ప్రబుద్ధుడు. దీంతో న్యా యం కోసం ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన సంఘటన మండలంలోని సముద్రాలలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పరపల్లి రజిని (25) పీజీ వరకు చదువుకుంది. అదే గ్రామానికి చెందిన పిల్లి శ్రీకాంత్ (28) ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మూడేళ్లుగా వెంటపడుతున్నాడు. అతని మాటలను రజిని పూర్తిగా నమ్మింది. ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చింది. అప్పుడు ఇప్పుడు అంటూ చెప్పుకొచ్చిన శ్రీకాంత్.. ఈనెల ఒకటోతేదీన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళమేసి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన రజిని.. న్యాయం కోసం ఈనె ల మూడో తేదీన కోహెడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సరిగ్గా స్పందించకపోవడంతో గత్యంతరం లేక ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల సభ్యులు ఆమెకు మద్దతు పలికారు. బాధితురాలికి న్యాయం చేయాలని సిద్దిపేట, హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. సీఐ సదన్‌కుమార్ సంఘటనస్థలానికి చేరుకుని రజినికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఆందోళనలో మహిళా సంఘం ప్రతినిధులు గూడెం లక్ష్మి, వసుధ, సముద్రాల సర్పంచ్ బొల్లం రవి, సంపంగి తిరుపతి, ఉప్పుల స్వామి, కుల సంఘాల ప్రతినిధులు అంతగిరి రాజేంద్రప్రసాద్, అంజయ్య, రామరాజు నర్సయ్య ఉన్నారు.