
ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన రజని
ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. గర్భవతిని చేశాక.. పెళ్లి మాట ఎత్తేసరికి ఊరు విడిచి వెళ్లాడో ప్రబుద్ధుడు. దీంతో న్యా యం కోసం ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన సంఘటన మండలంలోని సముద్రాలలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పరపల్లి రజిని (25) పీజీ వరకు చదువుకుంది. అదే గ్రామానికి చెందిన పిల్లి శ్రీకాంత్ (28) ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మూడేళ్లుగా వెంటపడుతున్నాడు. అతని మాటలను రజిని పూర్తిగా నమ్మింది. ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చింది.
అప్పుడు ఇప్పుడు అంటూ చెప్పుకొచ్చిన శ్రీకాంత్.. ఈనెల ఒకటోతేదీన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళమేసి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన రజిని.. న్యాయం కోసం ఈనె ల మూడో తేదీన కోహెడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సరిగ్గా స్పందించకపోవడంతో గత్యంతరం లేక ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల సభ్యులు ఆమెకు మద్దతు పలికారు.
బాధితురాలికి న్యాయం చేయాలని సిద్దిపేట, హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. సీఐ సదన్‌కుమార్ సంఘటనస్థలానికి చేరుకుని రజినికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఆందోళనలో మహిళా సంఘం ప్రతినిధులు గూడెం లక్ష్మి, వసుధ, సముద్రాల సర్పంచ్ బొల్లం రవి, సంపంగి తిరుపతి, ఉప్పుల స్వామి, కుల సంఘాల ప్రతినిధులు అంతగిరి రాజేంద్రప్రసాద్, అంజయ్య, రామరాజు నర్సయ్య ఉన్నారు.