
రమేశ్
భూపాలపల్లి: భార్యపై అనుమానంతో గొడవపడిన భర్త మద్యం మత్తులో ఆమెపై హత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారంరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని బేతిగల్‌కు చెందిన అంబాల రమేశ్ (29) కొన్నేళ్ల క్రితం భూపాలపల్లికి వచ్చి రాంనగర్ లో నివసిస్తూ కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
రమేశ్‌కు ఆరేళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన శైలజతో వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు కలగకపోవడంతో ఏడాదిన్నర క్రితం మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(24)ని వివాహం చేసుకున్నాడు. రాజ్యలక్ష్మిపై అనుమానంతో రమేశ్ కొద్ది రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి రమేశ్ బాగా మద్యం సేవించి వచ్చి గొడవపడ్డాడు.
రాత్రి ఒంటిగంట సమయంలో రాజ్యలక్ష్మిపై హత్యాయత్నం చేశాడు. కడుపు, ఎడమ చేయిపై కత్తితో పొడవడంతో రాజ్యలక్ష్మి రక్తం మడుగులో కుప్ప కూలింది. తర్వాత రమేశ్ అదే కత్తి తో చేతి మణికట్టు వద్ద నరాన్ని కోసుకున్నాడు. అనంతరం బైక్‌పై కొద్దిదూరం వెళ్లి కిందపడిపోయాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి కేటీకే 5వ ఇంక్‌లైన్ గని సమీపంలోని జామాయిల్ చెట్ల వద్ద మృతి చెందాడు. కాగా, రమేశ్ ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాజ్యలక్ష్మిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.