
జోసఫ్‌రాజుతో భాగ్యలక్ష్మి కలిసి ఉన్న పాత ఫొటో
కృష్ణాజిల్లా , ఇబ్రహీంపట్నం (మైలవరం): పెళ్లి చేసుకుంటానని ప్రేమించి చివరకు మోసం చేసిన ప్రియుడి ఇంటిముందు ఓ ప్రియురాలు మౌన దీక్షకు దిగింది. కిలేశపురం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాకు అనేక వివరాలు వెల్లడించారు. కిలేశపురం గ్రామానికి చెందిన జోసఫ్‌రాజు ఎన్టీటీపీఎస్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇబ్రహీంపట్నంలో బ్యూటీపార్లర్ నడుపుతున్న బాధితురాలు భాగ్యలక్ష్మితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. పెళ్లి పేరు ఎత్తగానే అతను ముఖం చాటేసినట్లు బాధితురాలు చెబుతోంది.
2018 నవంబర్‌లో జోసఫ్‌రాజు నమ్మించి మోసం చేశాడని పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అప్పట్లో టీడీపీ నాయకులు జోసఫ్ తరఫున వకాల్తా పుచ్చుకుని కేసును నీరుగార్చారు. కొంతకాలం దూరంగా ఉన్న ఇరువురు మరలా స్నేహం చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోసఫ్‌కు వివాహం అని తెలుసుకున్న భాగ్యలక్ష్మి ప్రియుడి ఇంటికి వచ్చేసింది. విషయాన్ని నలుగురికి చెప్పుకుని ప్రాధేయపడింది. అయితే ప్రియుడి తరఫు బంధువులు ఇంటి వద్ద లేకపోవటంతో అక్కడే బైఠాయించింది.
ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన భాగ్యలక్ష్మి ,మీడియాతో మాట్లాడుతున్న భాగ్యలక్ష్మి
నమ్మి ప్రేమిస్తే మోసం చేశాడని ఆరోపించింది. కేసు తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో జోసఫ్‌రాజుకు 2018లోనే వివాహం అయ్యిందని జోసఫ్ తండ్రి శామ్యూల్ చెబుతున్నాడు. అందుకు అవసరమైన వివాహం ఫొటోలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పోలీసులకు చూపిస్తున్నాడు. భాగ్యలక్ష్మితో తమ అబ్బాయికి ఉన్న సంబంధంపై గతంలో కేసు పెట్టినప్పుడే రాజీ చేసుకున్నామని చెబుతున్నాడు. అయితే అవన్నీ కట్టుకథలని జోసఫ్‌కు రెండు రోజుల క్రితమే వివాహం అయ్యిందని బాధితురాలు చెబుతోంది. అతనితోనే తనకు వివాహం జరిపించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా, దీనిపై సీఐ దుర్గారావును వివరణ కోరగా జోసఫ్‌రాజుపై 2018లోనే కేసు నమోదు చేశామని, అది కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment