బడుగులకు అందని సంక్షేమ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: బడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందడం లేదు. ముఖ్యంగా స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలు దళితులకు చేరడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15లో స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన, భూపంపిణీ, నైపుణ్యాల మెరుగుదలకు సంబంధించి రూ.1,193 కోట్లతో మొత్తం 29,030 మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణను ప్రకటించారు. అయితే గత జూన్ 30తో గడువు ముగియగా, ఇంకా పదివేల మందికి రుణాలు అందలేదు. దీంతో గడువును నవంబర్ 17 వరకు పొడిగించారు.
అక్టోబర్ 28 నాటికి జిల్లాల వారీగా 19,345 మందికి రూ.299.66 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇందులో 2013-14కు సంబంధించి మిగిలిపోయిన 13,042 మంది లబ్ధిదారులు ఉండటం గమనార్హం. వీరిని కలపకపోతే 2014-15లో కేవలం ఆరువేల మందికే ప్రయోజనం కల్పించి నట్లు అవుతుంది. హైదరాబాద్లో 5,516 మందికి లబ్ధి చేకూర్చాలన్నది లక్ష్యంకాగా.. పది శాతం అంటే 536 మందికే అందించారు.
మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండగా, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో లక్ష్యానికి మించి ప్రయోజనం కల్పించారు. ఆయారంగాల వారీగా చూస్తే, బ్యాంక్ ఆధారిత పథకాల కింద 9,332 మందిని లక్ష్యంగా పెట్టుకోగా 5,509 మందికి లబ్ధి చేకూర్చారు. నాన్ బ్యాంక్ లింక్డ్ పథకాల్లో మొత్తం 19,698 మందికి ప్రయోజనం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో కేవలం 794 మందికే లబ్ధి చేకూరింది. మరోవైపు, పథకాల అమలను జిల్లాస్థాయిలో పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ) పోస్టులు ఏడు జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో ఆయా పథకాల ప్రయోజనం దక్కే పరిస్థితి కరువైంది.