low pressure trough
-
చల్లని కబురు.. 5 రోజులు ఎండల నుంచి ఉపశమనం: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వారం రోజులుగా ఎండలు, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రానున్న అయిదు రోజుల్లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వడగాలులు వీసేందుకు అవకాశాలు లేవని అంచనా వేసింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, యూపీ, పంజాబ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వాన కురుస్తుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. (మువ్వన్నెల జెండాకు అవమానం.. చికెన్ శుభ్రం.. వీడియో వైరల్.. అరెస్ట్) -
తుపాన్ హెచ్చరిక
► 48 గంటల్లో భారీ వర్షాలు ► గోడకూలి చిన్నారి మృతి ► సహాయక చర్యలకు ఏర్పాట్లు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తుపానుగా మారే అవకాశం ఉందని దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నైవాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది.ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు జాతీయ విపత్తుల సహాయక బృందాలు సిద్ధమయ్యాయి. - సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై : అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణిగా మారింది. ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలోని మధ్యస్థానం దానికి ఆనుకునే ఆగ్నేయంలో నిలకడగా ఉన్న ఈ తుపాను గంటకు 20 కి.మీ వేగంతో ఒడిశా దిశగా పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి ఆగ్నేయంలో 570 కి.మీ దూరంలో, ఒడిశాలోని బారాదీప్ మార్బర్ ముఖ ద్వారం నుంచి 750 కి.మీ దూరంలో బంగ్లాదేశ్ నుంచి 1,020 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో సముద్ర తీర జిల్లాల్లోనూ, దక్షిణ జిల్లాల్లోనూ మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. సహాయక బృందాలు సిద్ధం : గతేడాది నవంబరు, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు చెన్నై, కడలూరు, తూత్తుకూడి నగరాలను వరదనీరు ముంచెత్తింది. 421 మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గతేడాది చేదు అనుభవాల దృష్ట్యా రాష్ట్రం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఒక్కో ప్రాంతానికి ఒక ఐఏఎస్ అధికారి అజమారుుషీలో సహాయక బృందాలను సిద్ధం చేశారు. వీరితోపాటూ పోలీస్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ బృందంలో చేరారు. సముద్రతీర జిల్లాల్లో ఐజీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించింది. ఇలా ఉండగా, జాతీయ విపత్తుల సహాయక బృందాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తొలిదశలో అరక్కోణంలోని శిబిరం నుంచి ఐదు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఒక్కో బృందంలో 45 మంది సభ్యులు ఉండగా మొత్తం 255 మంది సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి చెన్నై, కడలూరు, తూత్తుకూడి నగరాల్లో చిన్నపాటి బోట్లతో సిద్ధంగా ఉంటారు. రాష్ట్రంలో వర్షాలు : రెండు రోజులుగా సముద్రతీర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో అడపదడపా వర్షం కరుస్తోంది. తిరునెల్వేలీ, తూత్తుకూడి, మధురై, కోయంబత్తూరు, కన్యాకుమారి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో నాగపట్టణంలో గరిష్టంగా 14 సెం.మీ, కారైక్కాల్‌లో 11 సెం.మీ వర్షపాతం నమోదైంది. గోడ కూలి చిన్నారి మృతి : తిరుచందూరులో బుధవారం రాత్రి పిడుగులతో కూడిన భారీ వర్షానికి ఇంటి గోడ కూలి మీద పడడంతో వీరరాఘవపురానికి చెందిన కుమరన్ కుమార్తె రాఘవి(13) మృతి చెందింది. -
కరువు కోరలు
సాక్షి, ఖమ్మం: ‘బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఆకాశమంతా మేఘావృతం.. జిల్లా అంతటా కారు మబ్బులు.. అక్కడక్కడ జల్లులు, మరికొన్ని చోట్ల వేసవిని తలపిస్తున్న ఎండలు’ ఇదీ జిల్లాలో గత వారం రోజులుగా నెలకొన్న వాతావరణ పరిస్థితి. నైరుతి రుతు పవనాల రాకకోసం అన్నదాతలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా.. కారు మబ్బుల్లోంచి వరుణుడు కిందకు రావడం లేదు. ఇప్పటికే సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పంటల సాగుకు అనువైన వర్షాలు పడకపోవడంతో రైతులు ఈ ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్నారు. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 3.51 లక్షల హెక్టార్లు. రుతు పవనాలు మొహం చాటేయడంతో ఇప్పటివరకు కేవలం 1.34 లక్షల హెక్టార్లలో మాత్రమే పలు రకాల పంటలు సాగయ్యాయి. ఇంకా 2,16,894 హెక్టార్లు బీడు భూములుగానే ఉన్నాయి. జిల్లాలో ఎక్కువగా పత్తి సాగవుతుంది. ఈ పంట సాధారణ సాగు విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటికి 1.16 లక్షల హెక్టార్లు మాత్రమే సాగయింది. ఆ పంటలకు కూడా తగినంత వర్షం పడకపోవడంతో రైతులు బిందెలతో నీరు తెచ్చి మొక్కలను తడుపుతూ కాపాడుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట చేతికి రాదని ఆందోళన చెందుతున్నారు. మిగతా పంటలు సాగు చేసిన రైతులదీ ఇదే పరిస్థితి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అనువైన వర్షం పడకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నా.. వాటి సాగుకు కూడా తగినంత వర్షం లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. సాగర్‌లో విడుదల చేసేం దుకు నీరు లేకపోవడంతో ఆయకట్టు రైతులు రూ.లక్షలు అప్పు చేసి బోర్లు, బావులు తవ్విస్తున్నారు. ఈ నీటి వనరులతోనైనా కొద్ది ఎకరాల్లో వరి సాగు చేద్దామనుకుంటే.. అసలు వర్షాలు లేకపోతే బోర్లు, బావులు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. 22 మండలాల్లో వర్షాభావం.. రుత పవనాల జాడ లేకపోవడంతో జిల్లాలో 22 మండలాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. కుక్కునూరు, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, బయ్యారం, గార్ల, అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, చింతకాని, వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. గత ఏడాది ఇదే నెలలో సగటున ఒక్కో మండలంలో 33.9 సెం.మీ వర్షం పడితే ప్రస్తుతం ఈ నెలలో 11.7 సెం.మీ వర్షం మాత్రమే కురిసింది. గత నెలలో కేవలం ఐదు రోజులే వర్షాలు పడడం, ఈ నెలలో ఇప్పటి వరకు 10 రోజులు పొడి జల్లులే కురవడంతో ఇక సాగుపై అన్నదాతల ఆశలు వదులుకున్నారు. గత ఏడాది జూలైలో సాధారణ వర్షపాతం 31.4 సెం.మీ కాగా 33.9 సెం.మీ వర్షం పడింది. ప్రతి ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కన్నా అదనంగా పడుతున్నా ఈసారి కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది. ఈ వారం రోజుల్లో నైరుతి రుతు పవనాలు అనుకూలించి వర్షం పడితేనే ఈ నెల సాధారణ వర్షపాత స్థితికి చేరే అవకాశం ఉంది. వర్షాభావంపై శాస్త్రవేత్తల అధ్యయనం.. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి ప్రభుత్వం జిల్లాకు ఎనిమిది మందితో కూడిన శాస్త్రవేత్తల బృందాన్ని పంపింది. కూసుమంచి మండలం జీళ్లచెరువు, వైరా మండలం రెబ్బవరం, అష్ణగుర్తి గ్రామాల్లో సోమవారం ఈ బృందం పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడింది. విత్తిన పత్తి గింజలు, మొలకెత్తిన పత్తిని సభ్యులు పరిశీలించారు. ఈ వారం రోజులలో వర్షం పడకపోతే కంది, జొన్న, పొద్దు తిరుగుడు సాగు చేసుకోవాలని సూచించారు. ఈనెలలో వర్షం పడకపోతే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో ఉన్న వర్షాభావ పరిస్థితులు, ఎండిపోతున్న పంటల విషయమై వ్యవసాయ శాఖ అధికారులతో శాస్త్రవేత్తలు చర్చించారు. గతంలో వర్షపాత నమోదు, పంటల సాగు వివరాలు తీసుకున్నారు. మొత్తంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితి, పంటల సాగుపై నివేదిక తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని తెలిపారు.