► 48 గంటల్లో భారీ వర్షాలు
► గోడకూలి చిన్నారి మృతి
► సహాయక చర్యలకు ఏర్పాట్లు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తుపానుగా మారే అవకాశం ఉందని దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నైవాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది.ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు జాతీయ విపత్తుల సహాయక బృందాలు సిద్ధమయ్యాయి. - సాక్షి ప్రతినిధి, చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై : అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణిగా మారింది. ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలోని మధ్యస్థానం దానికి ఆనుకునే ఆగ్నేయంలో నిలకడగా ఉన్న ఈ తుపాను గంటకు 20 కి.మీ వేగంతో ఒడిశా దిశగా పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి ఆగ్నేయంలో 570 కి.మీ దూరంలో, ఒడిశాలోని బారాదీప్ మార్బర్ ముఖ ద్వారం నుంచి 750 కి.మీ దూరంలో బంగ్లాదేశ్ నుంచి 1,020 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో సముద్ర తీర జిల్లాల్లోనూ, దక్షిణ జిల్లాల్లోనూ మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురువనున్నాయి.
సహాయక బృందాలు సిద్ధం : గతేడాది నవంబరు, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు చెన్నై, కడలూరు, తూత్తుకూడి నగరాలను వరదనీరు ముంచెత్తింది. 421 మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గతేడాది చేదు అనుభవాల దృష్ట్యా రాష్ట్రం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఒక్కో ప్రాంతానికి ఒక ఐఏఎస్ అధికారి అజమారుుషీలో సహాయక బృందాలను సిద్ధం చేశారు.
వీరితోపాటూ పోలీస్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ బృందంలో చేరారు. సముద్రతీర జిల్లాల్లో ఐజీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించింది. ఇలా ఉండగా, జాతీయ విపత్తుల సహాయక బృందాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తొలిదశలో అరక్కోణంలోని శిబిరం నుంచి ఐదు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. ఒక్కో బృందంలో 45 మంది సభ్యులు ఉండగా మొత్తం 255 మంది సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి చెన్నై, కడలూరు, తూత్తుకూడి నగరాల్లో చిన్నపాటి బోట్లతో సిద్ధంగా ఉంటారు.
రాష్ట్రంలో వర్షాలు : రెండు రోజులుగా సముద్రతీర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో అడపదడపా వర్షం కరుస్తోంది. తిరునెల్వేలీ, తూత్తుకూడి, మధురై, కోయంబత్తూరు, కన్యాకుమారి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో నాగపట్టణంలో గరిష్టంగా 14 సెం.మీ, కారైక్కాల్‌లో 11 సెం.మీ వర్షపాతం నమోదైంది.
గోడ కూలి చిన్నారి మృతి : తిరుచందూరులో బుధవారం రాత్రి పిడుగులతో కూడిన భారీ వర్షానికి ఇంటి గోడ కూలి మీద పడడంతో వీరరాఘవపురానికి చెందిన కుమరన్ కుమార్తె రాఘవి(13) మృతి చెందింది.
తుపాన్ హెచ్చరిక
Published Fri, Nov 4 2016 4:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
Advertisement
Advertisement