భువనేశ్వర్: గులాబ్ తుపాన్ తీరం దాటుతూ భారీ నష్టంతో పాటు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావాన్ని అంత సులువుగా మర్చిపోలేము కూడా. అందుకే ఇద్దరు మహిళలు ఈ తుపాను ప్రళయ కాలంలో పుట్టిన తమ శిశువులకు గులాబ్ అని పేరు పెట్టుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ విశేషం చోటుచేసుకుంది. కుని రైట్, నందిని సబర్ ఇద్దరు మహిళలు ఆదివారం గులాబ్ తుపాన్ ప్రతాపాన్ని చూపిస్తుండగా వేరువేరు ప్రభుత్వ ఆస్పత్రులలో కుమార్తెలకు జన్మనిచ్చారు.
సోరడపల్లి గ్రామానికి చెందిన సబర్ అనే వ్యక్తి సుమండల ఆరోగ్య కేంద్రంలో, అంకులి పంచాయతీకి చెందిన రైట్ పాత్రాపూర్ కమ్యునిటీ ఆస్పత్రిలో చిన్నారులకు జన్మనిచ్చారు. అయితే వారు తమ పిల్లల పేర్లు అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని భావించి గులాబ్ అని పేర్లు పెట్టుకున్నారు. దీనిపై సబర్ మాట్లాడుతూ.. తన బిడ్డ అందరికి గుర్తుండిపోయే రోజున ప్రపంచంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఈ తుపాను ప్రభావం చూపగా ఆంధ్రాలో తీర ప్రాంతాల్లో అధికంగా చూపింది. కాగా ఈ తుపాన్‌కు గులాబ్ అనే పేరు పాకిస్తాన్ సూచించింది. గులాబ్ అంటే ఉర్దూలో గులాబీ పువ్వు అని అర్థం.
చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా..