ఫైలిన్ దెబ్బకు 'పూరి' మొత్తం ఖాళీ
ఫైలిన్ తుపాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషాలోని కోస్తా తీర ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిషాలోని పవిత్ర పుణ్యక్షేత్రం జగన్నాథస్వామి దేవాలయం ఉన్న పూరి పట్టణాన్ని మొత్తం ఖాలీ చేయించారు. పూరితో పాటు గంజాం, గజపతి, ఖోర్దా, జగత్సింగ్పూర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని దాదాపు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
యాత్రికులెవరూ పూరి జగన్నాథస్వామి దర్శనానికి వెళ్లరాదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లను మూయించి వేశారు. తీరం ప్రాంతంలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో 70 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.