ఆ ఐదు గ్రామాలూ ఖాళీ
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బస్సుల్లో వీరిని సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సింహాచలం కొండ దిగువ పాత గోశాల దగ్గర నుంచి మార్కెట్ కూడలి వరకు ఉన్న పలు ప్రైవేటు కల్యాణ మండపాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. వెంకటాపురంలో ఉన్న 1250 ఇళ్ల నుంచి సుమారు 8 వేల మందిని, నందమూరినగర్‌లో ఉన్న 600 కుటుంబాలకు చెందిన 2,250 మందిని, కంపరపాలెంలోని 250 ఇళ్ల నుంచి 1200 మందిని, పద్మనాభనగర్‌లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. పూర్తిగా ప్రమాదం లేదని నిర్ధారించిన తరువాతే ప్రజలను గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, చినగదిలి తహసీల్దార్ పునరావాస కేంద్రాల వద్దకు వెళ్లి బాధితులను పలకరించారు. కాగా, గురువారం అర్ధరాత్రి కూడా వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.