
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం
30న తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశం
నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన
కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు
డిసెంబరు 3 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న వాతావరణ శాఖ
వివిధ పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : ఫెంగల్ తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ., చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. ఇది బుధవారం సా.5.30కు తుపానుగా బలపడింది.
అనంతరం.. శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. దీని ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనూ, రాయలసీమలోని తిరుపతి జిల్లాలోనూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ఇక తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి..
ఫెంగల్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకుపోయేలా రైతులు ఏర్పాట్లుచేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి. – రోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ

Comments
Please login to add a commentAdd a comment