coastal Andhra Pradesh
-
దూసుకొస్తున్న ‘ఫెంగల్’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : ఫెంగల్ తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ., చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. ఇది బుధవారం సా.5.30కు తుపానుగా బలపడింది. అనంతరం.. శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. దీని ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనూ, రాయలసీమలోని తిరుపతి జిల్లాలోనూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలి..ఫెంగల్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకుపోయేలా రైతులు ఏర్పాట్లుచేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి. – రోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ -
ఎండల వేళ.. ఉరుముల వాన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు ఉధృతమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఊపందుకుంటూ ఉష్ణ తీవ్రతను పెంచుతున్నాయి. మార్చిలోనే ఏప్రిల్ నాటి ఎండలను తలపిస్తున్నాయి. ఈ తరుణంలో చల్లని జల్లులను కురిపించే వాతావరణం నెలకొంటోంది. ఒకపక్క ఉష్ణతాపం కొనసాగుతుంటే.. మరోపక్క ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుంది. మరోవైపు ఈ నెల 20 నాటికి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌కు చేరువలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో 20న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, నెట్వర్క్: అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాలపై విస్తరించిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకుని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లో జలకళ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బుధవారంతో పోల్చితే గురువారం పలు జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 2.24 సెంటీ మీటర్లుగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 6.02 సెంటీ మీటర్లు, విశాఖపట్నం జిల్లాలో 5.24 సెంటీ మీటర్లు, కృష్ణా జిల్లాలో 4.48 సెంటీ మీటర్లు, నంద్యాల జిల్లాలో 4.43 సెంటీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 4.19 సెంటీ మీటర్లు చొప్పున అత్యధిక వర్షపాతం కురిసింది. తిరుపతి జిల్లాలో 0.21 సెంటీ మీటర్లు అత్యల్ప వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి వరకూ కురిసిన వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ఏర్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టుల నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ఎప్పటి కప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. తాజా వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. విజయవాడ–హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు మున్నేరు వాగు ఉద్ధృతి కారణంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, కీసర గ్రామంలో 65వ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్న కారణంగా విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌లో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా వెళ్లాలన్నారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఈ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. -
హెచ్చరిక : భారీ నుంచి అతిభారీ వర్షాలు..!
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో వాయువ్యం దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఈరోజు (మంగళవారం), రేపు (బుధవారం) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. (చదవండి : ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు) కర్ణాటక కోస్తా ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఉంటుందని, 23, 24 తేదీల్లో అక్కడ కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఇక వచ్చే నాలుగు రోజులపాటు ద్వీపకల్ప భారతంలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతంలో ఈనెల 24 25న వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య భారతంలో వచే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. మంగళవారం నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. (చదవండి : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు) -
ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణం): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని సోమవారం వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ ప్రభావం వల్ల తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాలు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులు వరద ప్రవాహంతో పోటెత్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటికి దిగువకు వదులుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. (చదవండి: తీర గ్రామాలను చుట్టుముట్టిన వరద) -
జరభద్రం.. రేపటి నుంచి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ రెండో తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 31, సెప్టెంబర్ 1,2 తేదీల్లో కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడా తేలిక పాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. -
తమిళనాడు, కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన
సాక్షి, చెన్నై/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకొని వాయుగుండం కొనసాగుతుంది. చెన్నై తీరానికి 1440 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. ఈ వాయుగుండం శనివారం తుపాన్‌గా మారనుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపాన్‌కు ‘ఫణి’ పేరును ఖరారు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తుపాన్ తీరం దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. తుపాన్ తీరం దాటే సమయంలో మాత్రం గంటకు 90 నుంచి 115 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా తమిళనాడు, కోస్తాంధ్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో ఆయా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతోపాటు.. అలలు సాధారణం కంటే ఎక్కువగా ఎగసి పడే అకాశం ఉంది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు తక్షణమే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. చదవండి: ‘ఫణి’ దూసుకొస్తోంది వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం -
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శ్రీలకంలోని ట్రింకోమలీకి 1140 కి.మీ తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కి.మీ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం శనివారం రాత్రికి తుఫానుగా మారనుందని ఐఎండీ పేర్కొంది. అనంతరం 96 గంటల్లో శ్రీలంక తీరానికి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మద్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మే 1వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెను గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. తుపానుకు ఫణిగా నామకరణం ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ పేరును ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్ మూడో వారంలో తుపాను ఏర్పడింది. ఆ తుపానుకు పెథాయ్ పేరును థాయ్‌లాండ్ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే పేరు పెడతారు. ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుపానుకు ‘ఫణి’గా శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. చదవండి: ‘ఫణి’ దూసుకొస్తోంది -
కోస్తాకు పిడుగులు.. జల్లులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులతో పోల్చుకుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికంగా రికార్డవుతున్నాయి. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతోంది. శనివారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు రాయలసీమలో ఉష్ణతీవ్రత కొనసాగనుంది. శనివారం అక్కడ సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా తిరుపతితో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రెండు రోజులు వడగాడ్పుల ప్రభావం ఉండదని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో వేపాడ, నందిగామల్లో 3 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. -
కోస్తాకు వాయుగుండం.. అల్లకల్లోలంగా సముద్రం
సాక్షి, అమరావతి: కోస్తా ఆంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ ప్రభావంతో డిసెంబర్ 14 నుంచి 16 మధ్య కాలంలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురవనుందని తెలిపారు. సుమద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. గంటకు 70 నుంచి 100 మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. -
అల్పపీడనంగా మారిన వాయుగుండం
-
కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు
విశాఖపట్నం : కోస్తాంధ్రకు వర్ష సూచన ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ... ఉత్తర కోస్తా తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. అది 3 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఆ ఆవర్తనం ఆవరించి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని... రేపటి నుంచి క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. -
కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు
-
కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది ఉత్తర కోస్తా తీరానికి అనుకుని కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురస్తాయని తెలిపింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 -50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా 6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. అలాగే అల్పపీడనం కోస్తాంధ్ర తీరంపైకి చేరుకుందని తెలిపింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా బలమైన ఈదురుగాలులు విస్తాయని తెలిపింది. అయితే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది పశ్చిమ బెంగాల్లో తీరాన్ని అనుకుని కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం మరింత బలపడి ఒడిశావైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఛత్తీస్గడ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ తీరాలను ఈ అల్పపీడనం ఆనుకుని ఉందని తెలిపింది. అలాగే అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఒడిశా, కోస్తాంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని.... కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కి.మీ. వేగంలో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
మూడు రోజుల్లో కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. -
కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు ఆగ్నేయంగా 140 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది. రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే నెల్లూరు తీరంలో ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లురుపేట, కావలిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
కోస్తాంధ్రలో వర్షాలు... ఈదురుగాలులు
విశాఖపట్నం : మధ్య భారతంపై తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. అలాగే అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే అల్పపీడన ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. -
రేపటి నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. అది రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోస్తాంధ్రలో చెదురుమదురుగా... రేపటి నుంచి మాత్రం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. -
కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు
విశాఖపట్నం : ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఇది మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 - 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. -
రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్రా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.