హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు ఆగ్నేయంగా 140 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది. రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితే నెల్లూరు తీరంలో ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లురుపేట, కావలిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.