నాలుగు రోజులపాటు రాష్ట్రంలో భిన్న వాతావరణం
ఉష్ణతాపం, ఉక్కపోతతోపాటు తేలికపాటి వర్షాలు
20న కోస్తాంధ్రలో భారీ వర్షాలకు ఆస్కారం
సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు ఉధృతమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఊపందుకుంటూ ఉష్ణ తీవ్రతను పెంచుతున్నాయి. మార్చిలోనే ఏప్రిల్ నాటి ఎండలను తలపిస్తున్నాయి. ఈ తరుణంలో చల్లని జల్లులను కురిపించే వాతావరణం నెలకొంటోంది. ఒకపక్క ఉష్ణతాపం కొనసాగుతుంటే.. మరోపక్క ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.
వీటన్నిటి ఫలితంగా రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుంది. మరోవైపు ఈ నెల 20 నాటికి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌కు చేరువలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో 20న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment