సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శ్రీలకంలోని ట్రింకోమలీకి 1140 కి.మీ తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కి.మీ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం శనివారం రాత్రికి తుఫానుగా మారనుందని ఐఎండీ పేర్కొంది.
అనంతరం 96 గంటల్లో శ్రీలంక తీరానికి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మద్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మే 1వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెను గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు.
తుపానుకు ఫణిగా నామకరణం
ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ పేరును ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్ మూడో వారంలో తుపాను ఏర్పడింది. ఆ తుపానుకు పెథాయ్ పేరును థాయ్‌లాండ్ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే పేరు పెడతారు. ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుపానుకు ‘ఫణి’గా శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు.
చదవండి: ‘ఫణి’ దూసుకొస్తోంది
Comments
Please login to add a commentAdd a comment