విశాఖపట్నం: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రకు అనుకొని విశాఖ ఒడిశాల మధ్య అల్పపీడనం కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం అనుకొని 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది.
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా తీరంలో నైరుతి దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.