బలపడినట్లే బలపడి.. తీవ్ర వాయుగుండంగా బలహీనం
షియర్ జోన్ కారణంగా నెమ్మదించిన తుపాను
30 సాయంత్రానికి సముద్రంలోనే కరైకాల్–మహాబలిపురం మధ్య బలహీనపడనున్న తీవ్ర వాయుగుండం
నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట రూరల్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను దాగుడుమూతలాడుతోంది. దీన్ని ట్రాక్ చేసేందుకు వాతావరణ శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇది బుధవారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారినట్లే మారి కాస్తా బలహీనపడిపోయింది. దీంతో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. మళ్లీ తుపానుగా బలపడే అవకాశాలున్నా.. ఎప్పుడనే దానిపై అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది.
తుపాను వ్యతిరేక శక్తిలా పనిచేస్తున్న బలమైన గాలులతో కూడిన షియర్ జోన్.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తుపానుకు వ్యతిరేక దిశలో ఇది కొనసాగుతుండటంవల్ల.. 48 గంటలు గడిచినా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని.. ఈ కారణంగానే ఫెంగల్ ముందుకు కదల్లేకపోతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు.. ఈ తీవ్ర వాయుగుండం గంటకు కేవలం 10 కిమీ వేగంతో నెమ్మదిగా కదులుతూ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ట్రింకోమలికి 200 కిమీ, పుదుచ్ఛేరికి ఆగ్నేయంగా 410 కిమీ, చెన్నైకి దక్షిణాగ్నేయంలో 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా సముద్రంలోనే బలహీనపడనుందని అధికారులు చెబుతున్నారు.
అనంతరం.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్రమంలో.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలైన కరైకల్, మహాబలిపురం మధ్య 30వ తేదీ ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 50–60 కిమీ.. గరిష్టంగా 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.
ఒకవేళ తుపానుగా బలపడితే మాత్రం గంటకు 65–75 కిమీ.. గరిష్టంగా 85 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నేటి నుంచి వర్షాలు..
ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. అలాగే 30 నుంచి డిసెంబరు 2 వరకూ కోస్తాంధ్ర అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. ఈఓఎస్–06, ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాల సహాయంతో ఫెంగల్ తుపాను కదులుతున్న తీరుపై ఇస్రో అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment