తక్కువ సమయం.. ఎక్కువ ఆదాయం
తుమ్మలపల్లి(నందివాడ):
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే వనామి(రొయ్య)సాగులో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ అన్నారు. గ్రామంలో సూర్యనారాయణరాజు సాగు చేస్తున్న వనామీని ఆయన బుధవారం పరిశీలించారు. రొయ్యల సాగు కత్తిమీద సాము వంటిదని తెలిపారు. పట్టుతప్పితే చేతులు తెగటం ఖాయమని పేర్కొన్నారు. నిపుణుల ఆధ్వర్యంలో సాగు చేస్తే ఫలితం పొందటానికి అవకాశం ఉంటుందని వివరించారు. సాగుకు అతి ముఖ్యమైనది విత్తనం అన్నారు. నాణ్యమైన పిల్లను ఎంచుకోవటంలో కొంచెం దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలోనే రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలన్నారు. అనుమతి లేని రొయ్యపిల్లల తయారీ సంస్థలపై దాడులు చేయనున్నట్లు వివరించారు. విజయవాడలో మూడు ప్రత్యేక బృందాలతో గురువారం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరు అనుమతిలేని రొయ్య, చేపల పిల్లల తయారీ సంస్థలపై దాడులు చేస్తారని పేర్కొన్నారు. జంక్షన్‌కు చెందిన సూర్యనారాయణరాజు ఆరు ఎకరాల్లో రొయ్యల చెరువు సాగు ప్రారంభించి నేడు 500 ఎకరాల సాగుకు ఎదిగినట్లు పేర్కొన్నారు. నాణ్యమైన పిల్లలు, మేత, పరిశుభ్రమైన వాతావరణం చూసుకోవటమేనని ఇందుకు కారణమని వివరించారు. రైతులు ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న ఏరియేటర్లతో లబ్ధి పొందాలని సూచిం చారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీఏలు కె.ఫణిప్రకాష్, గోపిరెడ్డి, రామ్మోహన్, ఎఫ్‌డీవో శ్రీనివాసరావు, రైతులు సూర్యనారాయణరాజు, గూడపాటి వెంకటేశ్వరరావు, ప్రసాద్‌రాజు, శివాజీరాజు, రాధాకృష్ణ, భాస్కరరాజు సిబ్బంది పాల్గొన్నారు.