ఒక్క రూపాయికే విమాన ప్రయాణం!
విమాన సర్వీసు యాజమాన్యాల మధ్య నెలకొన్న పోటీ కారణంగా సామాన్యులకు కూడా ఆకాశమార్గాన ప్రయాణించడమనేది అందుబాటులోకి వస్తోంది. గత త్రైమాసికంలో 75 శాతం మేరకు విమాన ఛార్జీలను తగ్గించిన స్సైస్ జెట్ ఒక రూపాయి చార్జీకే దేశీయ విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపింది. దీనికి తోడుగా స్పైస్ జెట్ మరికొన్ని ప్రత్యేక స్కీములను ప్రకటిచింది. మంగళవారం నుంచి మూడు రోజుల్లోగా ప్రయాణించేవారు రూ. 799, 1499 రూపాయలకే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ వెల్లడించింది.
టికెట్ రేటుకు అదనంగా ఎయిర్ పోర్ట్ ఫీజు, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో టికెట్లు రిజర్వు చేసుకునే సదుపాయం జూలై నెల ఆరంభం నుంచి వచ్చే సంవత్సరం మార్చి 28 తేది వరకు ఉంటుంది. గతంలో తాము ప్రకటించిన స్కీమ్ కు విపరీతమైన స్పందన వచ్చింది. కొత్తగా విమానాల్లో ప్రయాణించేవారికి ఇది చక్కటి అవకాశం అని స్పైస్ జెట్ చీఫ్ సంజీవ్ కపూర్ తెలిపారు.