ఆశలు ఆవిరి
- రబీనీ దెబ్బతీసిన వరుణుడు
- కనీస వర్షపాతం కూడా నమోదుకాని వైనం
- భారీగా పడిపోయిన సాగు విస్తీర్ణం
- బీళ్లుగా మారిన పొలాలు
- దిక్కుతోచని స్థితిలో రైతన్న
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌ను అల్లకల్లోలం చేసిన వరుణుడు రబీ వ్యవసాయాన్ని కూడా అతలాకుతలం చేశాడు. రబీపై రైతన్న పెట్టుకున్న కాస్తో కూస్తో ఆశలను ఆవిరి చేసేశాడు. అక్టోబర్ నుంచి ప్రారంభమైన ఈ రబీలో అన్ని పంటలు కలిపి 1,30,965 హెక్టార్లలో సాగులోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతానికి కేవలం 28 వేల హెక్టార్లకు పరిమితం కావడం విశేషం. ఖరీఫ్‌కు సంబంధించి జూ¯ŒS నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 257.3 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో 6.70 లక్షల హెక్టార్లలో వేసిన ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. జూన్, జూలై మినహా కీలకమైన ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షంజాడ లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోవడంతో రైతులకు రూ.కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తమ్మీద 492.7 మి.మీ గానూ 283.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 42.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్, రబీ ఆశలు గల్లంతయ్యాయి.
రబీ పరిస్థితి ఇలా
రబీ సాగుకు కీలకమైన అక్టోబర్‌లో వర్షాలు కురవకపోవడంతో 78 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావాల్సిన ప్రధాన పంట పప్పుశెనగ 18,800 హెక్టార్లకు పరిమితమైంది. అరకొర తేమలో వేయడం వల్ల వేసిన పప్పుశెనగ నుంచి దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరో ప్రధాన పంట వేరుశనగ 20 వేల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 4,500 హెక్టార్లు మాత్రమే సాగులో ఉంది. విత్తు సమయం ముగిసిపోవడంతో వేరుశనగ పంట కూడా సగం కన్నా తక్కువగానే రావచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 10 వేల హెక్టార్లలో వరి సాగులోకి రావాల్సి ఉంగా ఇంకా 800 హెక్టార్లలో ఉంది. జొన్న 6,672 హెక్టార్లకు గానూ 1,750 హెక్టార్లు, మొక్కజొన్న 5926 హెక్టార్లకు గానూ 800 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 4,673 హెక్టార్లకు గానూ 300 హెక్టార్లు, ఉలవ 3,855 హెక్టార్లకు గానూ 60 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి 25 శాతం విస్తీర్ణంలో పంటలు వేయగా ఇంకా 75 శాతం విస్తీర్ణం ఖాళీగానే దర్శనమిస్తోంది. రబీకి సంబంధించి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 155.5 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 26.4 మి.మీ మాత్రమే నమోదు కావడం వర్షాభావ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమం చేసుకోవచ్చు. అది కూడా ఇటీవల సంభవించిన తుఫాను వల్ల సాధ్యమైంది. కాగా గతేడాది రబీ సీజన్లో 1.26 లక్షల హెక్టార్లలో రబీ పంటలు వేశారు. ఈ సారి మాత్రం అందులో సగం కూడా సాగులోకి రాలేదు.