విద్యుత్ శాఖకు పెరిగిన ఎల్టీ ఆదాయం
విజయనగరం మున్సిపాలిటీ: ఓ వైపు మండుటెండలతో పెరిగిన వినియోగం, మరో వైపు పెరిగిన యూనిట్ చార్జీలతో ఎల్టీ సర్వీసుల ద్వారా విద్యుత్ శాఖకు ఈ నెల ఆదాయం పెరిగింది. విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. దీంతో ఈనెల విద్యుత్ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 5లక్షల 75వేల ఎల్టీ సర్వీసులు ఉన్నాయి. వాటి ద్వారా బిల్లుల రూపంలో రూ 14 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. మే నెలలో వినియోగించిన విద్యుత్‌కు జూన్ నెలలో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల ఎల్టీ సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం రూ19 కోట్లకు పెరిగింది. సర్కిల్ సీనియర్ అకౌంట్స్ అధికారి జి.వెంకటరాజు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇకపై సరాసరి ప్రతి నెల రూ18 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.
హెచ్‌టీ సర్వీసుల ఆదాయం రూ 4 కోట్లు తగ్గుదల:
హెచ్‌టీ సర్వీసుల ద్వారా విద్యుత్ శాఖకు రావాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోంది. ఇందుకు జిల్లాలో అత్యధికంగా ఉండే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడుతుండటమే కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 243 వరకు హెచ్‌టీ సర్వీసులుండగా వాటి ద్వారా గతంలో రూ 42.50 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. జూన్ నెలలో చెల్లించాల్సిన మే నెల వినియోగం బిల్లులను పరిశీలిస్తే ఆదాయం రూ 38.50 కోట్లకు పడిపోయింది.
ఈ లెక్కన విజయనగరం ఆపరేషన్‌సర్కిల్ పరిధిలో రూ 4 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడడం వల్లే ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. జిల్లాలోని జయలక్ష్మి ఫెర్రో అల్లాయిస్ , బెర్రి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడగా.. డెక్కన ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ లైటింగ్ వినియోగానికే మాత్రమే విద్యుత్‌ను వాడుతున్నాయి. దీంతో అధిక మొత్తంలో విద్యుత్ వినియోగించే పరిశ్రమలు మూతపడటంతో విద్యుత్ శాఖ ఆదాయం తగ్గుతోంది.