Lubrication scheme
-
బొల్లినేని అరెస్టుకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, నెల్లూరు : మహారాష్ట్రలో ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుల అంచనాలు పెంచి రూ.20 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో నాగపూర్ ఏసీబీ అధికారులు పలు కేసులు నమోదు చేసి విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే అక్కడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అరెస్ట్ చేయకుండా ఆగిపోయారు. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులు కొట్టి వేయడంతో బొల్లినేని అరెస్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయమై నాగపూర్ ఏసీబీ డీఎస్పీ ఎంఎస్ టోట్రేను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాస్తవమేనని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరోవైపు నాగపూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా మరో కేసులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దోపిడీ ఇలా.. బొల్లినేనికి చెందిన శ్రీనివాస కనస్ట్రక్షన్ కంపెనీ తన అనుబంధ పి.బలరామ్ కంపెనీతో కలసి విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (వీఐడీసీ) పరిధిలో నెర్ల (పగోరా)ఎత్తిపోతల పథకం, గోద్రాజ్ బ్రాంచ్ కెనాల్ ఎర్త్‌వర్క్ –కవర్ వర్క్ పనులు తదితర మొత్తం 35 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది. రూ.6,672 కోట్ల వ్యయంతో పూర్తి చేయాల్సిన ఈ పనులను స్థానిక అధికారుల సహకారంతో రూ.26,722 కోట్ల వరకు అంచనాలు పెంచినట్లు అక్కడి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు బొల్లినేని రామారావు, శ్రీనివాసులురెడ్డిపై మహారాష్ట్రలో 8 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. నాగపూర్ ఏసీబీ అధికారులు రెండేళ్ల క్రితమే రెండు కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 203/17తో సెక్షన్లు 420,415,120 బీ, 13/1సీ కింద నమోదు చేశారు. అప్పట్లో 15 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే బొల్లినేనితో పాటు ఆయన బినామీ కంపెనీల్లో వారి నివాసాల్లో సోదాలు జరిపి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే బాధితులు చంద్రశేఖర్, ఎన్వీ రామారావుల ఫిర్యాదు మేరకు నాగపూర్ క్రైంబ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన మరో రెండు కేసులతో కలిపి మొత్తం 8 కేసులు ఉన్నట్టు సమాచారం. అలాగే ఉత్తరప్రదేశ్‌లో యూనియన్ బ్యాంకును నకిలీ బ్యాంక్ గ్యారంటీలతో బురిడీ కొట్టించడంపై కూడా కేసు నమోదయింది. ఆ కేసులో ఎమ్మెల్యే బొల్లినేనితో పాటు ఆయన సతీమణి, కుమారుడు కూడా నిందితులుగా ఉన్నారు. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో మాత్రం అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్టు నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులు కొట్టివేయడంతో బొల్లినేని అరెస్టుకు నాగపూర్ ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.100 కోట్ల ఆదాయ పన్ను ఎగవేత వీఐడీసీలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయంతో పాటు ఆదాయ పన్నుశాఖ అధికారులకు బాధితులు గతేడాది ఫిర్యాదు చేశారు. ఆదాయ పన్నుకు సంబంధించి దాదాపు రూ.100 కోట్ల వరకు ఎగవేసినట్లు పలు ఆధారాలు సైతం ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రాజెక్టుల పేరిట తన కంపెనీల ద్వారా నాగపూర్‌లోని పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.450 కోట్లకుపైగా రుణాలు బొల్లినేని పొందినట్లు తెలుస్తోంది. ఆ రుణాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో ఆయా బ్యాంకర్లు కూడా త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. సబ్ కాంట్రాక్టర్లకు రూ.209 కోట్ల ఎగనామం ఎమ్మెల్యే బొల్లినేని పలు ప్రాజెక్టుల్లో సబ్ కాంట్రాక్టులు ఇచ్చి ఆయా పనుల బిల్లులు పూర్తి స్థాయిలో తీసుకుని సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వకుండా ఎగనామం పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎన్వీ రామారావు, బెజవాడ గోవిందరెడ్డి, సీహెచ్ వెంకటేశ్వరరావు, వైష్ణవి కన్స్ట్రక్షన్, బొల్లినేని శ్రీనివాసులు తదితర కాంట్రాక్టర్లకు దాదాపు రూ.200 కోట్ల బిల్లులు ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 280 చెక్ డ్యామ్‌ల పనులకు సంబంధించి పనులు పూర్తయినా దాదాపు రూ.9 కోట్ల వరకు బిల్లులు నిలిపేసి బొక్కేయడంతో టీడీపీకే చెందిన వారితో పాటు దాదాపు 15 మంది సబ్ కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. టీడీపీ నేతలు ఇటీవల చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. బిల్లులు వచ్చినా పలు కారణాలతో దాదాపు రూ.9 కోట్ల వరకు ఇవ్వకుండా తిప్పుకుంటున్న వైనంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
ఎత్తిపోతలు..ఒట్టిపోతలు
సాక్షి, రామహేంద్రవరం: విలీన ఏటపాక మండలం రాయనపేట సమీపంలోని గోదావరి వద్ద 1200 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేయదలచిన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ఆమోదం లభించింది. 2010లో అప్పటి చిన్ననీటి పారుదల మంత్రి ఉన్నా సునీత లక్ష్మారెడ్డి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో ఏర్పాటు చేసే ఈ పథకం పనులను రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ప్రారంభించారు. సరైన ప్రణాళిక లేకుండానే యంత్రాంగం ప్రాజెక్టు ఇన్‌టేక్ పాయింట్‌ను ఎంపిక చేసింది. గోదావరిలో 365 రోజులు నీరు ఉండే ప్రాంతంలో కాకుండా గట్టు వెంబడి ఏర్పాటు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వచ్చే వరదలకు తప్పా మిగతా సమయంలో ఇన్‌టేక్ పాయింట్ వద్ద చుక్కనీరు ఉండదు. పైపులైను పనులను కూడా మధ్యలో నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే 8 గ్రామాల పరిధిలోని 600 మంది రైతుల భూముల్లో రెండు పంటలు పండుతాయి. 8 ఏళ్లుగా రైతులు ఈ ప్రాజెక్టు కోసం ఎదరు చూస్తూనే ఉన్నారు. 80 శాతం ప్రాజెక్టుల పరిస్థితి ఇంతే ఇదే కాదు ఏజెన్సీలో ఉన్న ఎత్తిపోతల పథకాల్లో దాదాపు 80 శాతం ప్రాజెక్టుల పరిస్థితి ఇలాగే ఉంది. రూ. కోట్లతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ఒట్టిపోతున్నాయి. లక్ష్యం నెరవేరక నిరుపయోగంగా ఉన్నాయి. రంపచోడవరం ఐటీడీఏతోపాటు చింతూరు ఐటీడీఏ పరిధిలోని విలీన మండలాల్లోనూ దారుణ పరిస్థితులున్నాయి. నీరు వెళ్లని ప్రదేశాలైన మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలకు సాగునీరందిచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) పరిధిలో జిల్లాలో 55 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి పరిధిలో 30,793 ఎకరాలకు సాగునీరందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఎనిమిది పథకాలు రద్దు చేయగా ప్రస్తుతం 29 ప£ýథకాలున్నాయి. వీటి ద్వారా 5,073 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో విలీనమైన ఏటపాక, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం ముంపు మండలాల్లో 55 ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 9,444 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. ఏజెన్సీలోని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని 92 ఎత్తిపోతల పథకాల్లో దాదాపు 85 శాతం పని చేయడంలేదు. ఫలితంగా రైతులు ఏటా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని అసంపూర్తిగా, మరికొన్ని మరమ్మతులకు నోచుకోక దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. సీఎం హామీ గోదారికెరుక ఏజెన్సీలోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెస్తామని విలీన మండలాల పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 29 పథకాల్లో ప్రస్తుతం గంగవరం మండలంలో నాలుగు, వై.రామవరంలో రెండు, రాజవొమ్మంగిలో ఒకటి, రంపచోడవరంలో ఒకటి మాత్రమే అరకొరగా పనిచేస్తున్నాయి. విలీన మండలాల్లో దాదాపు 48 పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. సీఎం హామీ మేరకు గతేడాది ఏపీఎస్ఐడీసీ అధికారులు రూ.24.23 కోట్లతో ప్రతిపాదనలు పంపినా వాటికి ఇంకా మోక్షం కలగలేదు. బీడు వారిన తమ పొలాలకు సాగునీరందించేలా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిచాలని ఏజెన్సీ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొలాలు బీడుభూలయ్యాయి నాకున్న ఐదేకరాలకు సాగునీరు లేక పంటలు పండటంలేదు. వైఎస్ పుణ్యామా అని ఎత్తిపోతల పథకం నిర్మించినా అది ఉపయోగపడటంలేదు. ఈ ఏడాది కూడా పొలాలు బీడ్లుగానే వదిలేయాల్సి వచ్చింది. ఎత్తిపోతలు పని చేస్తే రెండు పంటలు పండించుకుంటాం. గోదావరి పక్కనే పోతున్నా మాకు కరవు ఉంది.– చిచ్చడి భద్రయ్య,మంగవాయి గ్రామం, ఏటపాక మండలం -
భూములు ఇవ్వడానికి ససేమిరా
తాళ్లపూడి : గతంలో దౌర్జన్యంగా తమ భూములను లాక్కున్నారని మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని, తమ భూములు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఇచ్చేదిలేదని పోచవరం రైతులు తెగేసి చెబుతున్నారు. శనివారం చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్–3కి భూములు సర్వే చేయడానికి వచ్చిన బృందాన్ని అడ్డుకుని వారి వద్ద ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాళ్లపూడి పోలీస్ స్టేషన్లో పోచవరం, తాడిపూడి గ్రామాలకు చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు కాకర్ల మురళి, కాకార్ల వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు దుగ్గిరాల శ్రీనివాసరావు, జల్లేపల్లి సీతారామయ్య తదితరులు మాట్లాడుతూ గతంలో మూడు పథకాలకు తమ భూములు ఇచ్చి నష్టపోయామని మరోసారి ఇస్తే ఇక తమకు భూములు మిగలవని చెప్పారు. 2012లో 24 ఎకరాలకు గాను 60 మంది రైతులకు నష్ట పరిహారం పూర్తిగా ఇవ్వలేదని, మళ్లీ భూములు ఇవ్వాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ నెల 16 వరకు అభ్యంతరాలు చెప్పాలని నోటీసులు ఇవ్వగా, తమ భూములు ఇవ్వమని చెప్పామన్నారు. ఇప్పుడు సర్వే చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా 47 ఎకరాలు సేకరించాలని అనుకుంటున్నారని ఆ భూములు 80 మంది రైతులకు చెందినవన్నారు. పైప్‌లైన్ 55 మీటర్ల నుంచి 120 మీటర్లకు, కొత్తగా ఇప్పుడు 175 మీటర్లకు పెంచారన్నారు. మంత్రికి, ఆర్డీఓకు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను కలిసినా తమకు న్యాయం జరగలేదన్నారు. మోగా కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ అధికారులతో కలిసి తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని ఎస్సైను కోరారు. రైతులు గుల్లపూడి శివ, అనపర్తి వీరభద్రరరావు, సతీష్, దుగ్గిరాల సత్యనారాయణ, పరమేష్, కాకర్ల విష్ణు, శ్రీరామమూర్తి తదితరులు ఉన్నారు. -
ఎత్తిపోతల పథకం పనులు అడ్డగింపు
సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను రైతులు, సీపీఎం నాయకులు, ఐద్వా నాయకులు అడ్డుకున్నారు. బుదవారం పురుషోత్తపట్నం రెవెన్యూలో సంతకం చేయని కొండు నానిబాబు పంటభూమిలో దౌర్జన్యంగా పైల్‌పైన్ పనులు ప్రారంభించారు. దీంతో రైతులు, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, భద్రాచలం మాజీ ఎంపీ మిరియం బాబూరావు, రాజమహేంద్రవరం డివిజన్ కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి, ఐద్వా జిల్లా కార్యదర్శి పీ తులసి పంటపొలం వద్దకు చేసుకున్నారు. పనులు అడ్డగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు హెచ్చరించినా రైతులు, నాయకులు పనుల వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారు. దీనితో పోలీసులు వారిని సీతానగరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. నాయకులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం అందించాలని కోరుతున్న రైతుల అరెస్ట్ అన్యాయమన్నారు. సీపీఎం ఐద్వా నాయకులతోపాటుగా రైతులు నందిపాటి ఉదయ్‌భాస్కర్, మట్టా వెంకటేశ్వరరావు, కొండి నానిబాబు, పెనుగూరి వెంకటరామారావులను సాయంత్రం వరకు స్టేషన్లో ఉంచారు.