ఆదాయ పన్ను శాఖకు ఫిర్యాదు చేసిన పత్రాలు
సాక్షి, నెల్లూరు : మహారాష్ట్రలో ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుల అంచనాలు పెంచి రూ.20 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో నాగపూర్ ఏసీబీ అధికారులు పలు కేసులు నమోదు చేసి విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే అక్కడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అరెస్ట్ చేయకుండా ఆగిపోయారు. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులు కొట్టి వేయడంతో బొల్లినేని అరెస్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయమై నాగపూర్ ఏసీబీ డీఎస్పీ ఎంఎస్ టోట్రేను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాస్తవమేనని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరోవైపు నాగపూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా మరో కేసులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దోపిడీ ఇలా..
బొల్లినేనికి చెందిన శ్రీనివాస కనస్ట్రక్షన్ కంపెనీ తన అనుబంధ పి.బలరామ్ కంపెనీతో కలసి విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (వీఐడీసీ) పరిధిలో నెర్ల (పగోరా)ఎత్తిపోతల పథకం, గోద్రాజ్ బ్రాంచ్ కెనాల్ ఎర్త్‌వర్క్ –కవర్ వర్క్ పనులు తదితర మొత్తం 35 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది. రూ.6,672 కోట్ల వ్యయంతో పూర్తి చేయాల్సిన ఈ పనులను స్థానిక అధికారుల సహకారంతో రూ.26,722 కోట్ల వరకు అంచనాలు పెంచినట్లు అక్కడి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు బొల్లినేని రామారావు, శ్రీనివాసులురెడ్డిపై మహారాష్ట్రలో 8 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. నాగపూర్ ఏసీబీ అధికారులు రెండేళ్ల క్రితమే రెండు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ 203/17తో సెక్షన్లు 420,415,120 బీ, 13/1సీ కింద నమోదు చేశారు. అప్పట్లో 15 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే బొల్లినేనితో పాటు ఆయన బినామీ కంపెనీల్లో వారి నివాసాల్లో సోదాలు జరిపి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే బాధితులు చంద్రశేఖర్, ఎన్‌వీ రామారావుల ఫిర్యాదు మేరకు నాగపూర్ క్రైంబ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన మరో రెండు కేసులతో కలిపి మొత్తం 8 కేసులు ఉన్నట్టు సమాచారం. అలాగే ఉత్తరప్రదేశ్‌లో యూనియన్ బ్యాంకును నకిలీ బ్యాంక్ గ్యారంటీలతో బురిడీ కొట్టించడంపై కూడా కేసు నమోదయింది. ఆ కేసులో ఎమ్మెల్యే బొల్లినేనితో పాటు ఆయన సతీమణి, కుమారుడు కూడా నిందితులుగా ఉన్నారు. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో మాత్రం అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్టు నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులు కొట్టివేయడంతో బొల్లినేని అరెస్టుకు నాగపూర్ ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.
రూ.100 కోట్ల ఆదాయ పన్ను ఎగవేత
వీఐడీసీలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయంతో పాటు ఆదాయ పన్నుశాఖ అధికారులకు బాధితులు గతేడాది ఫిర్యాదు చేశారు. ఆదాయ పన్నుకు సంబంధించి దాదాపు రూ.100 కోట్ల వరకు ఎగవేసినట్లు పలు ఆధారాలు సైతం ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రాజెక్టుల పేరిట తన కంపెనీల ద్వారా నాగపూర్‌లోని పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.450 కోట్లకుపైగా రుణాలు బొల్లినేని పొందినట్లు తెలుస్తోంది. ఆ రుణాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో ఆయా బ్యాంకర్లు కూడా త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.
సబ్ కాంట్రాక్టర్లకు రూ.209 కోట్ల ఎగనామం
ఎమ్మెల్యే బొల్లినేని పలు ప్రాజెక్టుల్లో సబ్ కాంట్రాక్టులు ఇచ్చి ఆయా పనుల బిల్లులు పూర్తి స్థాయిలో తీసుకుని సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వకుండా ఎగనామం పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎన్‌వీ రామారావు, బెజవాడ గోవిందరెడ్డి, సీహెచ్ వెంకటేశ్వరరావు, వైష్ణవి కన్‌స్ట్రక్షన్, బొల్లినేని శ్రీనివాసులు తదితర కాంట్రాక్టర్లకు దాదాపు రూ.200 కోట్ల బిల్లులు ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 280 చెక్ డ్యామ్‌ల పనులకు సంబంధించి పనులు పూర్తయినా దాదాపు రూ.9 కోట్ల వరకు బిల్లులు నిలిపేసి బొక్కేయడంతో టీడీపీకే చెందిన వారితో పాటు దాదాపు 15 మంది సబ్ కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. టీడీపీ నేతలు ఇటీవల చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. బిల్లులు వచ్చినా పలు కారణాలతో దాదాపు రూ.9 కోట్ల వరకు ఇవ్వకుండా తిప్పుకుంటున్న వైనంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment