ఏటపాక మండలం రాయనపేటలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం
సాక్షి, రామహేంద్రవరం: విలీన ఏటపాక మండలం రాయనపేట సమీపంలోని గోదావరి వద్ద 1200 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేయదలచిన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ఆమోదం లభించింది. 2010లో అప్పటి చిన్ననీటి పారుదల మంత్రి ఉన్నా సునీత లక్ష్మారెడ్డి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో ఏర్పాటు చేసే ఈ పథకం పనులను రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ప్రారంభించారు. సరైన ప్రణాళిక లేకుండానే యంత్రాంగం ప్రాజెక్టు ఇన్‌టేక్ పాయింట్‌ను ఎంపిక చేసింది. గోదావరిలో 365 రోజులు నీరు ఉండే ప్రాంతంలో కాకుండా గట్టు వెంబడి ఏర్పాటు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వచ్చే వరదలకు తప్పా మిగతా సమయంలో ఇన్‌టేక్ పాయింట్ వద్ద చుక్కనీరు ఉండదు. పైపులైను పనులను కూడా మధ్యలో నిలిపివేశారు. ఈ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే 8 గ్రామాల పరిధిలోని 600 మంది రైతుల భూముల్లో రెండు పంటలు పండుతాయి. 8 ఏళ్లుగా రైతులు ఈ ప్రాజెక్టు కోసం ఎదరు చూస్తూనే ఉన్నారు.
80 శాతం ప్రాజెక్టుల పరిస్థితి ఇంతే
ఇదే కాదు ఏజెన్సీలో ఉన్న ఎత్తిపోతల పథకాల్లో దాదాపు 80 శాతం ప్రాజెక్టుల పరిస్థితి ఇలాగే ఉంది. రూ. కోట్లతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ఒట్టిపోతున్నాయి. లక్ష్యం నెరవేరక నిరుపయోగంగా ఉన్నాయి. రంపచోడవరం ఐటీడీఏతోపాటు చింతూరు ఐటీడీఏ పరిధిలోని విలీన మండలాల్లోనూ దారుణ పరిస్థితులున్నాయి. నీరు వెళ్లని ప్రదేశాలైన మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలకు సాగునీరందిచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) పరిధిలో జిల్లాలో 55 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి పరిధిలో 30,793 ఎకరాలకు సాగునీరందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఎనిమిది పథకాలు రద్దు చేయగా ప్రస్తుతం 29 ప£ýథకాలున్నాయి. వీటి ద్వారా 5,073 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో విలీనమైన ఏటపాక, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం ముంపు మండలాల్లో 55 ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 9,444 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. ఏజెన్సీలోని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని 92 ఎత్తిపోతల పథకాల్లో దాదాపు 85 శాతం పని చేయడంలేదు. ఫలితంగా రైతులు ఏటా సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని అసంపూర్తిగా, మరికొన్ని మరమ్మతులకు నోచుకోక దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.
సీఎం హామీ గోదారికెరుక
ఏజెన్సీలోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెస్తామని విలీన మండలాల పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 29 పథకాల్లో ప్రస్తుతం గంగవరం మండలంలో నాలుగు, వై.రామవరంలో రెండు, రాజవొమ్మంగిలో ఒకటి, రంపచోడవరంలో ఒకటి మాత్రమే అరకొరగా పనిచేస్తున్నాయి. విలీన మండలాల్లో దాదాపు 48 పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. సీఎం హామీ మేరకు గతేడాది ఏపీఎస్‌ఐడీసీ అధికారులు రూ.24.23 కోట్లతో ప్రతిపాదనలు పంపినా వాటికి ఇంకా మోక్షం కలగలేదు. బీడు వారిన తమ పొలాలకు సాగునీరందించేలా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిచాలని ఏజెన్సీ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పొలాలు బీడుభూలయ్యాయి
నాకున్న ఐదేకరాలకు సాగునీరు లేక పంటలు పండటంలేదు. వైఎస్ పుణ్యామా అని ఎత్తిపోతల పథకం నిర్మించినా అది ఉపయోగపడటంలేదు. ఈ ఏడాది కూడా పొలాలు బీడ్లుగానే వదిలేయాల్సి వచ్చింది. ఎత్తిపోతలు పని చేస్తే రెండు పంటలు పండించుకుంటాం. గోదావరి పక్కనే పోతున్నా మాకు కరవు ఉంది.– చిచ్చడి భద్రయ్య,మంగవాయి గ్రామం, ఏటపాక మండలం
Comments
Please login to add a commentAdd a comment