తాళ్లపూడి : గతంలో దౌర్జన్యంగా తమ భూములను లాక్కున్నారని మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని, తమ భూములు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఇచ్చేదిలేదని పోచవరం రైతులు తెగేసి చెబుతున్నారు. శనివారం చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్–3కి భూములు సర్వే చేయడానికి వచ్చిన బృందాన్ని అడ్డుకుని వారి వద్ద ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌లో పోచవరం, తాడిపూడి గ్రామాలకు చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు కాకర్ల మురళి, కాకార్ల వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు దుగ్గిరాల శ్రీనివాసరావు, జల్లేపల్లి సీతారామయ్య తదితరులు మాట్లాడుతూ గతంలో మూడు పథకాలకు తమ భూములు ఇచ్చి నష్టపోయామని మరోసారి ఇస్తే ఇక తమకు భూములు మిగలవని చెప్పారు.
2012లో 24 ఎకరాలకు గాను 60 మంది రైతులకు నష్ట పరిహారం పూర్తిగా ఇవ్వలేదని, మళ్లీ భూములు ఇవ్వాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ నెల 16 వరకు అభ్యంతరాలు చెప్పాలని నోటీసులు ఇవ్వగా, తమ భూములు ఇవ్వమని చెప్పామన్నారు. ఇప్పుడు సర్వే చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా 47 ఎకరాలు సేకరించాలని అనుకుంటున్నారని ఆ భూములు 80 మంది రైతులకు చెందినవన్నారు. పైప్‌లైన్ 55 మీటర్ల నుంచి 120 మీటర్లకు, కొత్తగా ఇప్పుడు 175 మీటర్లకు పెంచారన్నారు. మంత్రికి, ఆర్డీఓకు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను కలిసినా తమకు న్యాయం జరగలేదన్నారు. మోగా కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ అధికారులతో కలిసి తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని ఎస్సైను కోరారు. రైతులు గుల్లపూడి శివ, అనపర్తి వీరభద్రరరావు, సతీష్, దుగ్గిరాల సత్యనారాయణ, పరమేష్, కాకర్ల విష్ణు, శ్రీరామమూర్తి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment