విద్యార్థినిపై అత్యాచారం.. హత్య, వెల్లువెత్తిన నిరసన
హైస్కూలు విద్యార్థిపై దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను అత్యంత క్రూరంగా చంపడంతో అర్జెంటీనా వీధుల్లో వేలాదిమంది పౌరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నల్లటి దుస్తులు వేసుకుని వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ఎక్కువమంది మహిళలు కనిపించినా, కొందరు పురుషులు కూడా వారికి తోడయ్యారు. లూసియా పెరెజ్ అనే హైస్కూలు విద్యార్థిని ఈనెల 8వ తేదీన మరణించింది. డ్రగ్ డీలర్లే ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను ఒక స్పైక్‌తో పొడిచి చంపేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అర్జెంటీనా పౌరులు తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7.30 నుంచి గంట పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అర్జెంటీనాలో ఇటీవలి కాలంలో మహిళలపై హింసాత్మక నేరాలు ఎక్కువయ్యాయి. ప్రతి 36 గంటలకు ఒక మహిళ హత్యకు గురవుతోంది. గత సంవత్సరం జూన్ నెలలో ముగ్గురు మహిళలను దారుణంగా చంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక కిండర్‌గార్టెన్ టీచర్‌ను ఆమె మాజీ భర్త క్లాసులో పిల్లల ఎదుటే గొంతు కోసి చంపేశాడు. 14 ఏళ్ల యువతి గర్భవతి కావడంతో ఆమె బోయ్‌ఫ్రెండు ఆమెను కొట్టి చంపేశాడు. మరో మహిళను పట్టపగలే బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక కేఫ్‌లో మహిలను ఆమె మాజీ బోయ్‌ఫ్రెండు కత్తితో పొడిచి హతమార్చాడు. ఇప్పుడు లూసియా పెరెజ్ వంతు వచ్చింది. బ్యూనస్ ఎయిర్స్ నగరంలో భారీగా వర్షం పడుతున్నా కూడా నిరసనకారులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమ ప్రదర్శన కొనసాగించారు.