Lucknow woman
-
ప్రెస్మీట్ పెట్టి భర్తకు షాకిచ్చిన మహిళ
లక్నో: దేశవ్యాప్తంగా ‘తలాక్’వివాదంపై చర్చ నడుస్తున్న సమయంలో తాజాగా ‘ఖులా’ తెరమీదికొచ్చింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో షాజదా ఖతూన్ అనే ముస్లిం మహిళ శనివారం ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తన భర్తకు ‘ఖులా’చెప్పి విడాకులు తీసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ప్రెస్మీట్లో విలేకరుల సమక్షంలో ఖులాపై సంతకం చేశారు. జుబెర్ అలీతో పెళ్లైన కొత్తలో కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత తనను హింసించడం మొదలుపెట్టాడని, ఈ విషయాన్ని ముస్లిం పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని షాజదా పేర్కొన్నారు. అందుకే తన భర్త నుంచి ‘ఖులా’(విడాకులు) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షాజదా తెలిపారు. అంతేకాకుండా ‘ఖులా’పై సంతకం చేసి నోటీసును తన భర్తకు పంపించినట్లు వెల్లడించారు. షాజదాకు ముస్లిం మహిళల లీగ్ ప్రధాన కార్యదర్శి నైష్ హసన్ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహళి మాట్లాడుతూ.. ఖులా చెప్పి భర్త నుంచి విడాకులు పొందడం సరైన పద్ధతికాదని చెప్పారు. ఖులా ఇస్తున్నట్లు ముందుగా తన భర్తకు నోటీసు ఇవ్వాలని, ఇలాంటివి మూడు నోటీసులు పంపించిన తర్వాత స్పందించకపోతే విడాకులు ఇవ్వొచ్చని మౌలానా తెలిపారు. -
ప్రధాని మోదీకి లక్నో మహిళ లేఖ
లక్నో: ఇస్లాంలో కొనసాగుతున్న ట్రిఫుల్ తలాక్ సంప్రదాయాన్ని రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన బాధితురాలు ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి మొర పెట్టుకుంది. ఈ దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడాలని కోరుతూ ప్రధానికి లక్నో మహిళ షాగుఫ్తా షా లేఖ రాసింది. ట్రిఫుల్ తలాక్ ను రద్దు చేస్తారని తాను బీజేపీకి ఓటు వేశానని వెల్లడించింది. అబార్షన్ చేయించుకునేందుకు నిరాకరించడంతో తనను భర్త వదిలేశాడని తెలిపింది. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందన్న భయంతో తన భర్త షంషాద్ సయాద్ అబార్షన్ చేయించాలనుకున్నాడని తెలిపింది. తాను ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితం హింసించి ఇంటి నుంచి గెంటేశాడని, ట్రిఫుల్ తలాక్ చెప్పి తనను వదిలించుకున్నాడని వివరించింది. షారంగ్ పూర్ ప్రాంతానికి చెందిన షాగుఫ్తాకు సహాయం అందించేందుకు పోలీసులు ముందుకు వచ్చారు. అయితే ప్రధాని అయితేనే తనకు న్యాయం చేయగలరన్న ఉద్దేశంతో ఆయనకు ఆమె లేఖ రాసింది. ‘పేద, నిస్సహారాయులి మొర ఆలకించాలని ప్రధానమంత్రిని కోరుతున్నా. నాలాంటి వాళ్లకు న్యాయం జరగాలంటే ఈ దుష్ట సంప్రదాయానికి చరమగీతం పాడాలి. అప్పుడే మేమంతా గౌరవడం బతక గలుగుతామ’ని లేఖలో పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జిల్లా కలెక్టర్, జాతీయ మహిళా కమిషన్ కు కూడా లేఖ ప్రతులు ఆమె పంపించింది.