రొమేనియా అల్లుడు
తాజా గాసిప్
సల్మాన్‌ఖాన్‌కు దేశం చాలనట్టుంది. ఇక్కడ ఏ అమ్మాయీ నచ్చక రొమేనియా అమ్మాయితో షికార్లు చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం మీడియా ఆ అమ్మాయిని సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్ అని ఊరుకుంటోంది. కాని రొమేనియాలో వార్తలు చాలా దూరం వెళ్లాయి. సల్మాన్ తమ దేశం అమ్మాయిని చేసుకోబోతున్నాడని ఆ దేశంలోని టాబ్లాయిడ్లు పందిళ్లెక్కి కూస్తున్నాయి. ఇక అందరికీ ఒకటే కుతూహలం. సల్మాన్ రొమేనియాకు అల్లుడా?... ఆ దేశపు మోడల్ ‘లులియా’ అతనికి కాబోయే భార్యా? అని.
ఎవరీ లులియా?
ఈమె రొమేనియా మోడల్. వయసు 36. అక్కడ టీవీ రంగంలో ప్రెజెంటర్‌గా పని చేసింది. సినిమాల్లో పని చేయాలని కోరిక. భారతదేశం మీద ఆసక్తి ఉంది. 2012లో ‘డబ్లిన్’లో సల్మాన్ నటిస్తున్న ‘బాడీగార్డ్’ సినిమా షూటింగ్ జరుగుతుండగా తన అప్పటి ప్రియుడు, రొమానియన్ గాయకుడు అయిన ‘మేరియస్ మోగా’తో వెళ్లి కలిసింది. అప్పుడే సల్మాన్ కత్రినా కైఫ్‌తో బ్రేకప్‌లో ఉన్నాడు. ఈమె పరిచయం అతడికి ఊరట కలిగించింది. ఆ తర్వాతి సంవత్సరం లులియా తన ప్రియుడు మేరియస్ మోగాతో భారతదేశం వచ్చి సల్మాన్‌ను కలిసింది. ఆ తర్వాత ఆ జంట తిరిగి వెళ్లడం, విడిపోవడం, ఈసారి లులియా ఒక్కతే భారత్‌కు రావడం, ఆమెకు సల్మాన్ తన ఫామ్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చి సినిమా అవకాశాల కోసం ప్రోత్సహించడం... ఇదంతా జరిగినట్టు రొమే నియా పత్రికల కథనం. లులియా ఇక్కడ ఉంటూ సల్మాన్‌కే కాదు... అతడి తల్లి సుశీల, చెల్లెలు అర్పిత, సల్మాన్ తమ్ముడి మాజీ భార్య మలైకా అరోరాకు కూడా బాగా సన్నిహితమయ్యిందని బోగట్టా.
లడఖ్‌లో లవ్జంట
‘బజరంగీ భాయ్‌జాన్’ వంటి సూపర్‌హిట్ ఇచ్చిన కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ తాజాగా ‘ట్యూబ్‌లైట్’ అనే సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఇటీవల లడఖ్‌లో జరిగింది. ఈ సందర్భంగా షూటింగ్ యావత్తూ లులియా సల్మాన్ వెంటే ఉంది. షెడ్యూల్ అయ్యాక సల్మాన్-లులియా జంట లేహ్-లడఖ్‌లలోని పలు బౌద్ధ ఆరామాలను సందర్శించారు. దలైలామాను కూడా కలిశారు. సల్మాన్ షూటింగ్లో బిజీగా ఉంటే లులియా ‘లడఖ్ అందాలు’ పేరుతో డాక్యుమెంటరీ తీసే పనిలో పడిందని భోగట్టా. ఈ ఉదంతాలన్నీ సల్మాన్ రొమేనియా అల్లుడు కాబోతున్నాడనడానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. కాని సల్మాన్ పదేపదే ‘చచ్చినా పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి వయసైపోయింది’ అంటూనే ఉన్నారు. మరి ఈసారైనా ఈ ముదురు చేప రొమేనియా వలలో చిక్కుతుందేమో చూద్దాం!