కౌలు రైతుకు అప్పు తిప్పలు
పర్చూరు, న్యూస్‌లైన్: పంటలు వేసుకునే సమయంలో కౌలు రైతులు పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లాలోని రైతుల్లో 70 శాతం మంది కౌలుకు చేసేవారే. అటువంటి వారికి ప్రోత్సాహకాలు అందించడంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. కౌలు రైతులను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో జాయింట్ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆ గ్రూపులకు రుణాలిచ్చేలా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రూపులకు రుణాలు సక్రమంగా అందాయి. అయితే కౌలు రైతులను మరింతగా ఆదుకుంటామని మూడేళ్ల క్రితం కౌలు రైతుల భూ అధీకృత ఆర్డినెన్స్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే చట్టం పెట్టిన దగ్గర నుంచి సక్రమంగా అమలైన దాఖలాలు లేవు. రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రుణ అర్హత కార్డుల కోసం కౌలు రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు.
జిల్లాలో 2 లక్షల మంది కౌలు రైతులున్నా...రెవెన్యూ సదస్సుల్లో కేవలం 7 వేల మందిని మాత్రమే కౌలు రైతులుగా గుర్తించి రుణ అర్హత కార్డులు జారీ చేశారు. కార్డులు ఇచ్చిన వారికి కూడా సక్రమంగా రుణాలు ఇవ్వలేదు. గతేడాది జిల్లాలో * 240 కోట్ల వ్యవసాయ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా..* 33 కోట్లు మాత్రమే ఇచ్చారు. బ్యాంకుల వద్ద రైతు సంఘాలు ధర్నాలు చేసి రుణాలిప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లక్ష్యాలు పూర్తిచేసేలా అప్పు తిప్పలు
బ్యాంకర్లపై ఒత్తిడి తేవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించలేదు. జిల్లాలో మూడు నెలలుగా సమైక్య ఉద్యమాలు జరిగాయి. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీకాలేదు. పాత కార్డుల ప్రకారం రుణాలివ్వాలని బ్యాంకర్లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలూ జారీ కాలేదు. మౌఖిక ఆదేశాలు మాత్రమే వచ్చినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో మాత్రం రైతు సంఘాల ఒత్తిడి మేరకు రుణాలిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పూర్తయింది. రబీ సాగుకన్నా రుణాలిస్తే కౌలు ైరె తులకు ఊరట కలుగుతుంది.
రుణపరిమితి పెంపులోనూ అన్యాయమే...
గతేడాది వ్యవసాయ రుణం తీసుకున్న కౌలు రైతులు సక్రమంగా రుణాలు చెల్లిస్తే రుణపరిమితి పెంచాల్సి ఉంది. అయితే ఇందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. గతేడాది *15 వేలు తీసుకొని చెల్లించిన రైతులకు *25 వేలు, *20 వేలు చెల్లించిన రైతులకు * 30 వేల వరకు రుణాలివ్వాల్సి ఉంది. అయితే రుణఅర్హత పెంచి రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు రిక్తహస్తం చూపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన గుర్తింపు కార్డులివ్వాలి..
కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వసంతరావు
కౌలు రైతులకు యుద్ధప్రాతిపదికన రుణ అర్హత కార్డులు అందజేసి వెంటనే రుణాలిప్పించాలి. ఇప్పటికే రుణాలందక ఖరీఫ్ సీజన్ నష్టపోయారు. రబీ ప్రవేశిస్తున్న నేపథ్యంలో వెంటనే రుణాలిచ్చి కౌలు రైతాంగాన్ని ఆదుకోవాలి. కౌలురైతులకు నిర్దేశించిన చట్టం ప్రకారం రుణపరిమితి పెంచాలి. ఇప్పటికీ రుణాలివ్వని బ్యాంకులను ముట్టడించి కౌలు రైతులకు న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తున్నాం.