Lung transplants
-
సర్జరీ చేసేందుకని వెళ్తుండగా ప్రమాదం బారిన వైద్యుడు..ఐతే ..
కొంతమంది విధి నిర్వహణలో చూపించే నిబద్ధత చూసి సెల్యూట్ చేయకుండా ఉండలేం. ఎవ్వరైనా కొంతమేరు సాయం చేయగలరు. కానీ తానే దారుణమైన ఇబ్బుందుల్లో ఉండి అవతలి వాళ్ల మంచి కోసం ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు. అంత విశాల హృదయం ఉండటం అనేది అత్యంత అరుదు. అలాంటి కోవకే చెందినవాడు ముంబైకి చెందిన డాక్టర్ సంజీవ్ జాదవ్. వివరాల్లోకెళ్తే..డాక్టర్ సంజీవ్ జాదవ్ చెన్నైలోని 26 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల ఆపరేషన్ చేసేందుకని తన వైద్య బృందంతో సేకరించిన ఊపిరితిత్తుల అవయవంతో అంబులెన్స్‌లో వెళ్తున్నాడు. ఆయన పూణె నుంచి చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్తుండగా అనూహ్యంగా వారి అంబులన్స్‌కి యాక్సిడెంట్ అవుతుంది. ఈ ఘటనలో జాదవ్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్ ముందుబాగం దారుణంగా నుజ్జునుజ్జు అయిపోయింది. నడిపిన డ్రైవర్‌కి కూడా దారుణంగా గాయాలయ్యాయి. దీంతో డాక్టర్ జాదవ్ బృందం ఆ డ్రైవర్ని సమీపంలోని ఆస్ప్రతికి తరలించి వాళ్లంతా మరో వాహనంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లారు. అక్కడ నుంచి విమానంలో చెన్నైకి చేరుకుని సదరు వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి చేశాడు. నిజానికి వైద్యుడు జాదవ్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి అయినప్పటికీ పేషంట్ని కాపడటమే తన కర్తవ్యంగా భావించి ఆ బాధను ఓర్చుకుని మరీ క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించడం విశేషం. ఈ మేరకు జాదవ్ మాట్లాడుతూ..తాము పాటిల్ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన19 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తులను స్వాధీనం చేసుకున్నారం. ఈ అవయవాన్ని తమిళనాడులోని 26 ఏళ్ల పేషంట్‌కి మార్పిడి చేయాల్సి ఉంది. అయితే తమ వైద్య బృందం అంబులెన్స్‌లో బయలుదేరుతుండగా..తమ అండులన్స్ వెనుక టైర్ పేలడంతో యాక్సిడెంట్ అయ్యిందన్నారు. ఈ ఘటనలో డ్రైవర్‌కి, తమకి తీవ్ర గాయలయ్యాయని చెప్పుకొచ్చారు. ఐతే తాము సేకరించిన అవయవం కేవలం ఆరుగంటల్లోపు మార్పిడి చేస్తేనే పనిచేస్తుందని చెప్పారు. అందువల్లే తాను గాయాలైన సరే లెక్కచేయకుండా చెన్నై చేరుకుని ఆ పేషెంట్‌కి ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేశానని చెప్పుకొచ్చారు. నిజంగా జాదవ్ వైద్యో నారాయణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు కదా!. డాక్టర్లంతా ఇలా డ్యూటీ పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తే ఎంతోమంది రోగుల ప్రాణాలు నిలుస్తాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహారణ. (చదవండి: గొంతు, నోటి క్యాన్సర్లను గుర్తించే ఏఐ ఆధారిత పరికరం! లాలాజలంతోనే..) -
రెండు ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలో అరుదైన ట్రాన్స్‌ప్లాంట్
సికింద్రాబాద్, రాంగోపాల్‌పేట్: విషం తాగి తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడికి యశోద ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌తో ప్రాణం పోశారు. ఒకేసారి డబుల్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఇలాంటి శస్త్ర చికిత్స నాలుగవది కావడం గమనార్హం. శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్‌లు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ గత నెలలో వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అతన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్చారు. విషం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ పరిస్థితి ఏర్పడింది. అలాగే కిడ్నీలు, కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయనకు మెకానికల్ వెంటిలేటర్స్ వైద్యం అందించిన తర్వాత 20 రోజులకు పైగానే ఎక్మోపై చికిత్స అందించారు. అయినా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడలేదు. దీంతో రెండు ఊపిరితిత్తులను మారిస్తేనే యువకుడి ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్యులు బావించారు. కానీ భారతదేశంలో ఇలాంటి కేసుల్లో ఎక్మో వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన వాళ్లు లేరు. శరీరంలో ఎటువంటి పురుగుల మందు అవశేషాలు లేవని నిర్ధారించుకున్నాక ఊపిరితిత్తుల మారి్పడి కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేశారు. జీవన్‌దాన్ చొరవతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్, థొరాసిక్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కేఆర్ బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ మిమి వర్గీస్‌లతో కూడిన బృందం ఆరు గంటల పాటు శ్రమించి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో రోహిత్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. -
KIMS Hospital: ‘ఊపిరి’ ఆడుతుండగానే అమర్చారు.. దేశంలోనే తొలిసారి
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్ లంగ్ (ఎక్స్‌వీవో ఆర్గాన్ పర్ఫ్యూజన్ సిస్టమ్) మార్పిడి శస్త్ర చికిత్సను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ఊపిరితిత్తుల మార్పిడి విభాగం డైరెక్టర్ డాక్టర్ సందీప్ అత్తావర్ వెల్లడించారు. ‘మధ్య వయసున్న ఓ వ్యక్తి 2021 ఆగస్టు నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడు తున్నాడు. రోజూ 10 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటున్నాడు. ఆ వ్యక్తికి ఆదివారం ఉదయం కిమ్స్ వైద్య బృందం బ్రీతింగ్ లంగ్ మార్పిడి శస్త్ర చికిత్స చేసింది. ఈ పద్ధతిలో ‘కోల్డ్ ఇష్కేమియా టైమ్’వల్ల వచ్చే దుష్ప్రభావాలు తగ్గి ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. దాతలు ఇచ్చిన ఊపిరితిత్తుల విని యోగం 30 శాతం ఎక్కువవుతూ రోగికి మరింత ఎ క్కువ కాలం ప్రయోజనం ఉంటుంది’అని చెప్పా రు. అమెరికా, కెనడా, ఆస్ట్రియా లాంటి దేశాల్లోని అతి కొద్ది సంస్థల్లోనే ఈ పద్ధతుల ద్వారా ఊపిరిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నారన్నారు. అవయవాన్ని రవాణా చేసేటప్పుడు.. ముందే సేకరించిన అవయవాన్ని పోషకాలు, యాంటి బయాటిక్స్ ఉన్న ద్రావణంలో పెట్టడం వల్ల.. ఐస్ బాక్సులో రవాణా చేసే సమయంలో జరిగే కోల్డ్ ఇషేమిక్ ప్రభావం, గాయాల నుంచి కా పాడవచ్చని కిమ్స్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ విజల్ రాహుల్ వివరించారు. ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరిచేందుకు వాటిని కండీషనింగ్ చేసి తద్వారా నీరు చేరడాన్ని తగ్గించవచ్చని తెలిపారు. వైద్యుల బృందాన్ని కిమ్స్ సీఈ వో డాక్టర్ అభినయ్ బొల్లినేని అభినందించారు. ఏంటీ బ్రీతింగ్ లంగ్ ప్రక్రియ? బ్రీతింగ్ లంగ్ ప్రక్రియలో ఊపిరితిత్తులు ఆడుతున్నపుడే వాటిని చల్లబరిచే పరికరంలో పెడతారని, వెంటిలేటర్ సాయంతో కృత్రిమంగా ఊపిరి తీసుకునేలా చేస్తారని డాక్టర్ సందీప్ అత్తావర్ వివరించారు. ‘పోషకాలు, యాంటీ బయాటిక్స్ ఉన్న ద్రావణంలో ఆ ఊపిరితిత్తులను పెట్టడంతో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గుతుంది. మెషీన్‌లోనే బ్రాంకోస్కోపి ద్వారా వాయు మార్గాలను శుభ్రం చేయడం, అదే సమయంలో పలు పరీక్షలు చేయడం వల్ల ఊపిరితిత్తులు చల్లబడేలోపే వాటి పనితీరు బాగా మెరుగవుతుంది. ఈ ప్రక్రియ అంతా స్పెషలిస్టుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ తర్వాత వాటిని గ్రహీతకు అమరుస్తారు’ అని చెప్పారు. -
25 అక్టోబర్ 1990 తొలి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం
కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఎ. వాఘన్ స్టేర్న్స్ 12 సంవత్సరాల పాపకు ఆమె తల్లి నుంచి సేకరించిన ఊపిరితిత్తిని అమర్చారు. డాక్టర్ స్టేర్న్స్ పిడియాట్రిక్ కార్డియో థొరాసిక్ సర్జన్‌గా చాలా ప్రసిద్ధి. ఆయన నాలుగు నెలల పాపకు గుండెమార్పిడి చికిత్సతో సహా అప్పటికే ఎన్నో విజయవంతమైన అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. నిజానికి హార్ట్- లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంతకు ముందే అంటే 1968 లోనే జరిగింది. అయితే అది విజయవంతం కావడానికి చాలా కాలం పట్టింది. టొరెంటోలోని జనరల్ హాస్పిటల్లో డాక్టర్ బ్రూస్ రియిట్జ్ చేసిన లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జీవన్మృతుల నుంచి సేకరించిన అవయవాల సహాయంతో జరిగింది కాగా, ఇప్పుడు అంటే 1990 అక్టోబర్ 25న డాక్టర్ స్టేర్న్స్ చేసిన ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ రోగి తల్లి జీవించి ఉండగానే ఆమె నుంచి సేకరించడం ద్వారా జరిగింది కావడం విశేషం.