ఈ వైద్యుడు.. అటవీ సంరక్షకుడు
బళ్లారిలో ల్యాప్రోస్కోపిలో అత్యాధునిక వైద్యం అందిస్తున్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎస్కే అరుణ్ వన్యప్రాణులను, అటవీ సంరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు. దీంతో ఆయన పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనను బళ్లారి జిల్లా అటవీ, వన్యప్రాణుల సంరక్షుడిగా కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. నగరంలోని సత్యనారాయణ పేటలో పాండురంగ నర్సింగ్ హోంను నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్కే అరుణ్ వారంలో రెండు రోజుల పాటు అడవుల్లో గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి అడవులు, గ్రామాల్లోని పొలాల్లో తిరుగుతూ మంచి మంచి ఫొటోలు తీయడం అలవాటుగా చేసుకున్నారు.
దాదాపు రూ.10 లక్షలు విలువ చేసే కెమెరాను కొనుగోలు చేసుకుని.. ఆడవుల్లో సంచరిస్తూ పులులు, సింహాలు, అరుదైన పక్షుల ఫొటోలు తీస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే అరుణ్ సాక్షితో మాట్లాడుతూ.. సమాజంలో డబ్బులు సంపాదించడమే ప్రధానం కాదని, ఆరోగ్యంతో పాటు మనకు నిత్యం అవసరమవుతున్న నీరు, మంచిగాలిని ఎలా సంపాదించుకోవాలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలన్నారు. అడవులు ఉంటేనే వర్షాలు పడతాయని గుర్తు చేశారు. తుంగభద్ర, కావేరి నదులు నిండుతున్నాయంటే అందుకు కారణం డ్యాంల పైభాగాన ఉన్న విశాలమైన అడవులు, కొండలే కారణమన్నారు.
- సాక్షి, బళ్లారి
డాక్టర్ ఎస్కే అరుణ్