డిగ్రీ తర్వాత ఏది బెటర్?!
గుంటూరు ఎడ్యుకేషన్: డిగ్రీ విద్య పూర్తి చేసిన తరువాతే సీఏ చదవడం ఉత్తమమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఐసీఏఐ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆడిట్‌పై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చార్టర్డ్ అకౌంటెంన్సీ (సీఏ) చదవాలనే లక్ష్యం గల విద్యార్థులు ఇంటర్మీడియట్ కంటే డిగ్రీ పూర్తిచేసిన తరువాతే సీఏ కోర్సులో చేరడం మంచిదన్నారు. ఇంటర్మీడియెట్‌లో స్థాయిలో ఎంఈసీ కోర్సు అభ్యశించిన విద్యార్థులు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తున్నప్పటికీ సీఏ-సీపీటీలో ఉత్తీర్ణత శాతం అత్యంత తక్కువగా ఉంటోందని చెప్పారు. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు సీఏ కోర్సుపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గుంటూరు అమరావతిరోడ్డులోని ఐసీఏఐ శాఖకు సొంత భవన నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.
సీఏలకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత రీతిలో ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. మార్కెట్ అవసరాలు, మారుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలకు అనుగుణంగా విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఏ కోర్సు సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. అనంతరం బ్యాంక్ ఆడిట్‌పై ఆడిటర్లకు అవగాహన కల్పించిన దేవరాజారెడ్డి సీఏ విద్యార్థులకు ఉపయోపడే సమాచారాన్ని అందించేందుకు ఐసీఏఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నాలెడ్జ్ కియోస్క్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌సీ కౌన్సిల్ చైర్మన్ ఈ ఫల్గుణకుమార్, గుంటూరు శాఖ చైర్మన్ చేకూరి సాంబశివరావు, వైస్ చైర్మన్ చేగు అశోక్‌కుమార్, కార్యదర్శి కేవీ సుబ్బారావు, కోశాధికారి ఎం శ్రీనివాసరావు, సికాస చైర్మన్ ఎన్ శివరామకృష్ణ, సభ్యులు, ఆడిటర్లు, సీఏలు పాల్గొన్నారు.