తిరైకి వరాద కథైలో నదియా
ఒక నాటి మేటి నాయకి నదియా తమిళంలో ఎం కుమరన్ సన్ ఆఫ్ మహలక్ష్మీ చిత్రం ద్వారా రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. అయితే క్యారెక్టర్ పాత్రలకు మారిన తరువాత నదియా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేశారన్నది గమనార్హం. అలాంటిది చాలా గ్యాప్ తరువాత నదియా నటించిన తమిళ చిత్రం తిరైకి వరాద కథై. ఇందులో కోవై సరళ, ఇనియ, ఈడెన్, ఆర్తీ, సబిత మొదలగు వారు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే అందరూ నటీమణులే నటించడం.
చిత్రంలో ఒక మగ పాత్ర కూడా ఉండదట. ప్రముఖ మలయాళ దర్శకుడు తులసీదాస్ దర్శకత్వం వహించిన చిత్రం తిరైకి వరాద కథై. ఎంజేడీ ప్రొడక్షన్స్ పతాకంపై కే.మణికంఠన్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ చిత్ర కథ గురించి ఒక లైన్ చెప్పినా చిత్రం మొత్తం తెలిసిపోతుందన్నారు. అందుకని చాలా ఇష్టపడి, కష్టపడి ఎంజాయ్ చేస్తూ రూపొందించిన చిత్రం తిరైకి వరాద కథై అని తెలిపారు. నిర్మాత లేనిదే చిత్రమే లేదన్నారు. ఈ చిత్రానికి నిర్మాత మణికంఠన్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. చిత్రంలో ప్రేమ, యాక్షన్, హారర్, థ్రిల్లర్ అంటూ అన్ని అంశాలు ఉంటాయన్నారు.
ఇందులో నటించిన వారందరి సహకారం లేకపోతే చిత్రం ఇంత బాగా వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులోని మూడు ప్రధాన పాత్రలకు వేరే హీరోయిన్లను నటింపజేయాలని ప్రయత్నించగా కథ విన్న వారు నటించడానికి అంగీకరించినా హీరో లేని సినిమా సాధ్యమా?అంటూ వెనక్కు తగ్గారని తెలిపారు. అలాంటిది నటి నదియా, ఉనియ, ఈడెన్, కోవైసరళ లాంటి వారు నటించడానికి సమ్మతించడం చిత్రానికి మరింత బలం పెరిగిందనే అభిప్రాయాన్ని దర్శకుడు తులసీదాస్ వ్యక్తం చేశారు.ఈ చిత్ర ఆడియోను నటి నదియా ఆవిష్కరించగా నటుడు శ్రీకాంత్ తొలి సీడీని అందుకున్నారు.