M Natarajan
-
శశికళ భర్తకు సీరియస్?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ భర్త నటరాజన్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆయనకు ఛాతీ నొప్పి రాగా.. చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని.. ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త అనారోగ్యం వార్త అందుకోగానే హుటాహుటిన పెరోల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమచారం. కాగా, 74 ఏళ్ల నటరాజన్ లివర్ సంబంధిత వ్యాధితో గతంలోనూ అస్వస్థతకు గురికాగా.. శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆమె అప్పుడు భర్త కోసం కంటే రాజకీయాల పైనే ఎక్కువ దృష్టిసారించారన్న ఆరోపణలు వినిపించాయి. -
శశికళ భర్తకు అవయవదానం వెనుక ఏం జరిగింది?
సాక్షి, చెన్నై: జైలుపాలైన శశికళ భర్త ఎం నటరాజన్‌కు బుధవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అవయవమార్పిడి ఆపరేషన్ జరిగింది. 74 ఏళ్ల నటరాజన్‌కు ప్రాణాలను రక్షించే ఎంతో కీలకమైన కిడ్నీ, లివర్ టాన్స్ప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఆయనకు అవయవదానం చేసిన తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ టీనేజ్ యువకుడి దేహాన్ని బెయిన్‌డెడ్ స్థితిలో విమానంలో చెన్నైకి తరలించి.. నటరాజన్‌కు అవయవదానం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆపరేషన్ నిర్వహించిన గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీ హాస్పిటల్ తోసిపుచ్చింది. అవయవ మార్పిడి ఆపరేషన్ కోసం నటరాజన్ గత నెల గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి బాధ్యతల నుంచి ఉద్వాసనకు గురైన శశికళ భర్త నటరాజన్‌కు చాలాకాలంగా దూరం ఉంటున్న సంగతి తెలిసిందే. శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల కార్తీక్ అనే యువకుడి అవయవాలను నటరాజన్‌కు సమకూర్చారు. కార్తీక్ బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉండగా అతన్ని చెన్నైకి తరలించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఆస్పత్రి తిరస్కరించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చిన అనంతరం.. అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, వైద్య సలహాకు వ్యతిరేకంగా కార్తీక్‌ను చెన్నైకి కుటుంబసభ్యులు తరలించారని పేర్కొంది. అయితే, తీవ్రంగా గాయపడిన అతన్ని విమానంలో తరలించారా? లేక ఎలా తీసుకువచ్చారా? అనే విషయాన్ని ఆస్పత్రి వెల్లడించలేదు. అంతేకాదు నిబంధనలకు వ్యతిరేకంగా వీఐపీ కావడంతో నటరాజన్‌కు అవయవదానం ప్రక్రియను చేపట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, అవయవ దానం స్వీకరించే 'వెయిటింగ్ లిస్ట్'లో నటరాజన్ టాప్‌స్థానంలో ఉన్నారని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆయనకు అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని ఆస్పత్రి తెలిపింది. -
శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు
జయలలితను సీఎం చేసింది మేమే మేం రాజకీయాల్లో ఉంటే తప్పేంటి అన్నాడీఎంకే సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర తిరుచ్చి: దివంగత నేత జయలలిత వారసులుగా తమ కుటుంబం రాజకీయాల్లోకి ప్రవేశించడంపై వస్తున్న అభ్యంతరాలను అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ భర్త ఎం నటరాజన్ తోసిపుచ్చారు. తమ కుటుంబం రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. తంజావూరులో పొంగల్ వేడుకల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంజీఆర్ మృతి తర్వాత జయలలితను కాపాడటంలో తమ కుటుంబం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. ’ నా భార్య శశికళ 30 ఏళ్లపాట జయలలితను కాపాడింది. ఎంజీఆర్ భౌతికకాయాన్ని చూసేందుకు జయలలితను అనుమతించకపోతే.. మేం ఆమెను అంత్యక్రియలకు తీసుకెళ్లాం. ఎంజీఆర్ ను తరలిస్తున్న వాహనం నుంచి ఆమెను తోసివేస్తే.. మేం ఆమెకు అండగా నిలబడ్డాం. ఆమె జీవితాంతం మద్దతుగా నిలిచాం. జయలలిత సీఎం కాకూడదని బ్రాహ్మణులు అడ్డుపడ్డా.. మేం ఆమెను సీఎం చేశాం. కాబట్టి మా కుటుంబసభ్యులు రాజకీయాల్లో కొనసాగితే అది అనైతికమేమీ కాదు’ అని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు పన్నీర్ సెల్వాన్ని సీఎం పదవి నుంచి తప్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ’ద్రవిడులకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు చేస్తున్న కుట్రకు ఆడిటర్ గురుమూర్తి నేతృత్వం వహిస్తున్నారు. అందరు బ్రాహ్మణులను నేను విమర్శించడం లేదు. కానీ 10శాతం మంది రాష్ట్రాన్ని కాషాయమయం చేసేందుకు కుట్రపన్నుతున్నారు’ అని ఆరోపించారు. అదే సమయంలో ప్రధాని మోదీ మంచి వ్యక్తి అంటూ ప్రశంసలు గుప్పించారు.