10 నుంచి కోర్టుల్లో విధుల బహిష్కరణ
తెలంగాణ న్యాయవాదుల ఉద్యమ బాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన ప్రక్రియలో భాగంగా న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక జాబితాను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. అన్ని కోర్టుల్లో ప్రాథమిక కేటాయింపుల జాబితా ప్రతులను తగులబెట్టి హైకోర్టుకు తమ నిరసనను తెలియజేయనున్నారు.
న్యాయంగా దక్కాల్సిన 40 శాతం వాటా మేర మొదట తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేసింది. అలాగే తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అన్ని జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్రావు, బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం.సహోదర్రెడ్డి, పలు జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో తీర్మానాలు చేశారు.
కీలక తీర్మానాలు...
- మార్గదర్శకాలకు విరుద్ధంగా హైకోర్టు రూపొందించిన న్యాయాధికారుల కేటాయింపుల ప్రాథమిక జాబితాను ఉపసంహరించుకోవాలి.
- ఏపీ న్యాయాధికారులు తెలంగాణను ఎంపిక చేసుకుంటూ ఇచ్చిన ఆప్షన్ను వెనక్కి తీసుకునేలా కోరుతూ అన్ని కోర్టుల్లో బ్యానర్లు ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ మంత్రి తదితరులను కలసి వినతిపత్రాలు సమర్పించాలి.
- న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్ల నిధిని సక్రమంగా వినియోగించేందుకు వెంటనే మార్గదర్శకాలు జారీ చేయాలి. అలాగే న్యాయవాదులకు హౌసింగ్ స్కీం కోసం కూడా మార్గదర్శకాలు జారీ చేయాలి.
- స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా అన్ని పోలీస్స్టేషన్లకు ఆదేశాలివ్వాలి. ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి.