గోల్డ్‌మెడల్ కోసం 44 ఏళ్లు ఆగాడు!
లక్నో: అనిల్‌కుమార్ సింగ్ నలభై నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా నిరీక్షించారు. ఈ 44 ఏళ్ల కాలంలో ఆయన తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి.. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసి.. రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది.. పదవీ విరమణ కూడా చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తన ప్రతిభకు బహుమానంగా దక్కాల్సిన గోల్డ్‌మెడల్‌ను ఇప్పుడు 65 ఏళ్ల వయస్సులో ఆయన చేతికందింది. సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ) చలువతో 44 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది.
1971లో లక్నో యూనివర్సిటీలో ఇనార్గానిక్ కెమెస్ట్రీలో అనిల్‌కుమార్ సింగ్ అత్యధిక మార్కులు సాధించారు. కెమెస్ట్రీలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు యూనివర్సిటీ ప్రతి ఏటా ఎం రామన్ గోల్డ్‌మెడల్ అందజేస్తుంది. అయితే 1971లో ఏవో కారణాలతో స్నాతకోత్సవాన్ని నిర్వహించలేదు. దీంతో ఆ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్‌మెడళ్లు, బహుమానాలు అందలేదు. అయితే, యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన అనిల్‌కుమార్ తనకు జరిగిన అన్యాయంపై పోరాడారు. అనేకసార్లు యూనివర్సిటీ పాలకసిబ్బందికి వినతిపత్రాలు ఇచ్చారు. తన ప్రతిభకు బహుమానంగా గోల్డ్‌మెడల్ ప్రదానం చేయాల్సిందిగా కోరారు. 1971లో ఆయనకు అత్యధిక మార్కులు వచ్చాయన్న విషయాన్ని అంగీకరించిన లక్నో వర్సిటీ మాత్రం.. ఏదైనా సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే.. ఆ ఏడాది ఇవ్వాల్సిన గోల్డ్‌మెడళ్లు తర్వాత ఇవ్వడం కుదరదని మెలిక పెట్టింది.
దీనిపై సుదీర్ఘ కాలం పోరాడిన అనిల్‌కుమార్ సింగ్ 2007లో యూనివర్సిటీ నుంచి మార్కుల షీట్‌తోపాటు ఆయనకు గోల్డ్‌మెడల్ అర్హత ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సాధించారు. ఆ తర్వాత ఆర్టీఐ ద్వారా యూనివర్సిటీ చట్టంలోని సెక్షన్ 15.05ను ప్రస్తావిస్తూ మరో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయన దరఖాస్తుకు ఎట్టకేలకు వీసీ ఆమోదం తెలిపడంతో అనిల్‌కుమార్ సింగ్ తన ప్రతిభకు తగిన బహుమానాన్ని అందుకున్నారు. 44 ఏళ్ల నిరీక్షణ అనంతరం శనివారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేతులమీదుగా గోల్డ్‌మెడల్‌ను అందుకున్నారు. తన పోరాటం ఎట్టకేలకు విజయం సాధించడం ఆనందం కలిగిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.