ధోని రూ. 60 కోట్లు.. సచిన్ ఎంత?
ముంబై: 'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' హిందీ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వారంలో రూ. 100 కోట్లు పైగా వసూళ్లు రాబట్టింది. సుశాంత్ రాజ్ ఫుత్ హీరోగా నటించిన ఈ సినిమాలో 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని జీవితాన్ని అచ్చుగుద్దినట్టుగా తెరకెక్కించారు. అయితే తన జీవితకథ ఆధారంగా సినిమా తీసేందుకు అంగీకారం తెలపడానికి ధోని రూ. 60 కోట్లు పుచ్చుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ధోని ఒక్కడి మీదే కాకుండా పలు క్రికెటర్ల జీవితకథల ఆధారంగా ఇంతకుముందు సినిమాలు వచ్చాయి. ఇమ్రాన్ హష్మీ హీరోగా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ బయోపిక్ తెరకెక్కింది. ఈ సినిమాకు అజహరుద్దీన్ డబ్బులు తీసుకున్నట్టు వార్తలు రాలేదు.
తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాకు సచిన్ ఎంత మొత్తం తీసుకున్నాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే సచిన్ ఒక్క పైసా కూడా తీసుకోలేదట. మైదానంలో బయట కూడా 'హీరో'నని సచిన్ నిరూపించుకున్నాడని అభిమానులు, సన్నిహితులు పేర్కొన్నారు.