మెడికోల వేధింపు కేసులో ప్రొఫెసర్ అరెస్టు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) వైద్య కళాశాల మెడికోలపై వేధింపులకు పాల్పడ్డ కేసులో ప్రొఫెసర్ ఎంఏ సలాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ నారాయణ తెలిపారు. 2011లో రిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా ఎంఏ సలాం విధులు నిర్వర్తించారు. ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని 2011 జూన్ 28 అప్పటి రిమ్స్ డెరైక్టర్ శ్రీరాంబి రాథోడ్‌కు మెడికల్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత డెరైక్టర్ శ్రీరాంబి రాథోడ్ పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి డెరైక్టర్‌గా దుర్గాప్రసాద్‌ను నియమిం చారు. మెడికోలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఆయన ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణ నిమిత్తం నియమించారు.
దీంతోపాటు మెడికోలు, డెరైక్టర్ స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడికోల వేధింపులపై విచారణ చేపట్టిన అధికారులు డీఎంఈకి, అప్పటి కలెక్టర్‌కు పూర్తి నివేదిక అందజేశారు. నివేదికను పరిశీలించిన అనంతరం ఆరోపణలు రుజువైనందున అదే సంవత్సరం జూలై 13న ప్రొఫెసర్ సలాంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.