'సెల్ఫీ' సూసైడ్
బెంగళూరు: ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ వ్యక్తి తన చావుకు దారితీసిన కారణాలను మొబైల్లో 'సెల్ఫీ' రూపంలో రికార్డుచేశాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి భార్యపై హత్యాయత్నం చేయటం గమనార్హం. ఆలస్యంగా వెలుగు చేసిన సంఘటన వివరాలు.. బెంగళూరు సమీపంలోని మాదనాయకనహళ్లికి చెందిన వెంకటేశ్, విజయలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. విజయలక్ష్మి తన కుమారుడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లిన సమయంలో శివు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన వెంకటేశ్ భార్యను మందలించాడు. అయినా, ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో భార్యను హత్య చేయాలని పథకం వేశాడు. నవంబరు 26న భార్య విజయలక్ష్మిపై దాడిచేసి ఊపిరాడకుండా చేయటంతో స్పృహతప్పి పడిపోయింది.
ఆమె చనిపోయిందని భావించిన వెంకటేశ్ తన మొబైల్లో వీడియో రికార్డు ఆన్‌చేసి చీరతో అదే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు అనంతరం తెలివితెచ్చుకున్న విజయలక్ష్మి ఎదురుగా భర్త వేలాడుతుండటం చూసి మృతదేహాన్ని కిందకు దించింది. పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి భర్త ఆత్మహత్య సంగతిని వారికి తెలియజేసింది. ఈఘటనకు సంబంధించి వెంకటేశ్ సోదరుడు మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఐదు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయలక్ష్మి, ప్రియుడు శివును గురువారం అరెస్ట్ చేశారు.