ఓం హ్రీం బుస్!
మా యంత్రం ధరిస్తే మీ దరిద్రాలన్నీ పోయి అదృష్టవంతులవుతారు. దేశంలోని గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన యంత్రాలు తెప్పిస్తాం. నేరుగా మీకు అక్కడ నుంచి రావాలంటే రూ. 5 వేలకు పైగా ఖర్చవుతుంది. మేమైతే రూ.1500కే ఇచ్చేస్తాం. గుంటూరులో మా బ్రాంచి పెట్టడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఇది. అంటూ ఈ మధ్య కాలంలో కొందరు టెలీకాలర్ ద్వారా ఫోన్లు చేసి జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారు.
సాక్షి, గుంటూరు : కొంత మంది యంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. 2013 నుంచి 2015 మధ్య కాలంలో ఒక్క గుంటూరు నగరంలోనే పదుల సంఖ్యలో యంత్రాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఏదో పేరుతో ఆర్సీలు తీసుకుని బుకింగ్ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమైనప్పటికీ అధికారులకు భారీ స్థాయిలో మామూళ్లు వెళుతుండడంతో కిమ్మనకుండా ఉంటున్నారు.
మోసం జరుగుతుంది ఇలా...
విజయవాడ మార్కెట్లో రూ. 80లకు అమ్మే యంత్రాలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి గుంటూరు చుట్టుపక్కల గోడౌన్లలోకి చేర్చి వాటిని ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం వాటిని పోస్టాఫీస్‌ల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. పోస్టాఫీస్ ద్వారానే చెక్కు రూపంలో ఆ మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. ఒక్కో యంత్రానికి రూ. 1200 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో ఇదిఅత్యంత లాభసాటి వ్యాపారంగా మారడంతో నిర్వాహకులు కోట్లు గడిస్తున్నారు.
చంద్రమౌళీనగర్ పోస్టాఫీస్‌కు రోజుకు రూ.70 వేల ఆదాయం ...
యంత్రాల పేరుతో గుంటూరులో భారీగా వ్యాపారం జరుగుతుండటంతో పోస్టాఫీస్‌లకు సైతం అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. గుంటూరులోని అన్ని పోస్టాఫీసుల ద్వారా యంత్రాలను పార్శిల్ చేసి ప్రజలకు పంపుతున్నారు. నగరంలోని చంద్రమౌళీనగర్ పోస్టాఫీస్ ద్వారా రోజుకు 1500 బాక్సుల వరకు వెళుతుంటాయి. ఒక్కో బాక్సుకు రూ. 41 నుంచి రూ. 60 వరకు పోస్టాఫీస్‌కు ఆదాయం వస్తోంది. అంటే ఒక్క చంద్రమౌళీనగర్ పోస్టాఫీసుకు రోజుకు రూ. 70వేల వరకు ఆదాయం వస్తోంది. మిగిలిన పోస్టాఫీస్‌లను కూడా కలిపితే ఆ శాఖకు ఎంత ఆదాయం వస్తుందో లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.