మాదాపూర్ శివారులో చిరుత సంచారం
మాక్లూర్ : మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చిరుత పులి సంచరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొందరికి అటవీ ప్రాంతం వైపు గుట్టపై బండరాయి మీద చిరుత పులి కన్పిచింది. వారు వెంటనే మాక్లూర్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావు, మాక్లూర్ ఎస్సై సంతోష్‌కుమార్, ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ రవిమోహన్ సిబ్బందితో కలిసి చిరుత పులి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. చికటి పడిన తర్వాత చిరుత పులి రాయి పైనుంచి కిందికి దిగడంతో పోలీసులు, గ్రామస్తులు పరుగులు పెట్టారు. మాదాపూర్ అటవీ ప్రాంతం నుంచి జక్రాన్‌పల్లి మండలంలోని సికింద్రాపూర్ అటవీ ప్రాంతం వరకు చిరుతపులులు ఉన్నట్లు ఫారెస్టు రెంజ్ అధికారి రవిమోహన్ తెలిపారు. చీకటి పడినందున రాళ్లు, చుట్టూ ముళ్ల పొదలు ఉన్నందున చిరుత పులిని పట్టుకునే పరిస్థితి లేదని, మంగళవారం ఉదయం చిరుత పులిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాత్రి వేళలో చుట్టు ప్రక్కల గ్రామల ప్రజలు బయటకు రావద్దని సూచించారు. చిరుత పులికి చాలా భయం ఉంటుందని,అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. చిరుత పులిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి వేళలో ప్రజలు బయటకు వెళ్లవద్దని గ్రామాల్లో ఫారెస్టు, పోలీసు అధికారులు దండోర వేయించారు. చిరుత పులి అడవిలో కన్పించడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.