ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరిహారం
ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరి హారం చెల్లించాలని మోటారు వాహనాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) గురువారం న్యూఇండియా బీమా సంస్థను ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలో నివసించే 19 ఏళ్ల సోను అనే యువకుడు 2008లో ఓ బస్సు ఎక్కాడు. అయితే డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడుపుతూ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో అందులోనుంచి కింద పడ్డాడు. దీనిపై అప్పట్లో ఎంఏసీటీలో ఫిర్యాదు దాఖలైంది. దీనిని పరిశీలించిన ఎంఏసీటీ...సోను వాదన బలంగా ఉందని, పోలీసుల విచారణ దీనిని బలపరుస్తోందని ట్రిబ్యునల్ పేర్కొంది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారమూ లేదంది.
డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన కారణంగానే అతడు తీవ్రంగా గాయపడ్డాడనే విషయం తేలిందని ఎంఏసీటీ ప్రిసైడింగ్ అధికారి అజయ్కుమార్జైన్ పేర్కొన్నారు. వైద్యనివేదిక ఆధారంగా పరిహారం ఇవ్వాలని ఆదేశించిన ఎంఏసీటీ.... సోను ఈ ప్రమాదంలో 51 శాతంమేర గాయపడ్డాడని పేర్కొంది. తాత్కాలిక అంగవైకల్యానికి లోనయ్యాడంది. అయితే దానర్థం అతను శాశ్వత అంగవైకల్యానికి గురికాలేదని కాదంది. సోను దాదాపు ఆరు సంవత్సరాలపాటు వైద్యచికిత్స పొందుతూనే ఉన్నాడంది.
ఈ నేపథ్యంలో అతడు శాశ్వత వైకల్యానికి గురయ్యే ప్రమాదమూ లేకపోలేదంది. ఈ కారణంగా అతడు తన దైనందిన కార్యకలాపాలను చేసుకోలేకపోతున్నాడంది. కాగా 2008, డిసెంబర్ 15వ తేదీన సోను బస్సులో ఇంటికి బయల్దేరాడు. బస్సు దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా వేగం పెంచడంతో అందులోనుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీపంలోని ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు సోను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే బస్సు నుంచి కిందపడిపోయాడంటూ డ్రైవర్ చేసిన వాదనను ఎంఏసీటీ కొట్టిపారేసింది.