Mad dog attack
-
పిచ్చికుక్క దాడిలో 30 మందికి గాయాలు
ఖానాపురం వరంగల్ : పిచ్చికుక్క దాడిలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పిచ్చికుక్క గ్రామంలో స్వైర విహారం చేస్తూ ప్రజలను కరిచింది. కోపోద్రిక్తులైన గ్రామస్తులు, యువకులు కుక్కను వెంబడించి మట్టుబెట్టారు. పిచ్చికుక్క ప్రజలందరి ఎడమ కాలినే కరవడం గమనార్హం. ఈ ఘటన ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఖానాపురం మండలంలోని బుధరావుపేటలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఒకే పిచ్చికుక్క ఏకంగా 30 మందిని గాయపర్చడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో ప్రజలు ఏమీ చేయాలో అర్థం కాక పోలీసులకు 100కు డయల్ చేసినా పోలీసులు స్పందించలేదు. బాధితులు వీరే.. గ్రామానికి చెందిన సేరు ఓంప్రియ, కోడి హైమ, గారె కొంరమ్మ, ఐతె సాయమ్మ, కేశపాక వరలక్ష్మి, నల్లతీగల నీలమ్మ, పైండ్ల ప్రశాంత్, షేక్ గులాంరసూల్, నందగిరి లలిత, జెల్ల వెంకన్న, సింగు వెంకటయ్య, షేక్ లాక్య, ఉప్పలమ్మ, సోమగాని అరుణ, వేల్పుల రాణి, సింగు శాంతమ్మ, బత్తుల గోపమ్మ, గణపురం కోమలత, బోనగిరి శ్రీను, యాపచెట్టు రజిత, ధర్నోజు ఉప్పలయ్య, చాట్ల నర్సయ్య, పులిగిల్ల స్వరూప, పావనీతో పాటు మరికొంత మందిని తీవ్రంగా గాయపరిచింది. కుక్కను చంపిన గ్రామస్తులు.. గ్రామ యువకులు కుక్కను వెంబడించి చంపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన బాధితులను అంబులెన్స్, ప్రైవేట్ వాహనాల ద్వా రా నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ప్రాధమిక వైద్య చికిత్సలు అందించిన తర్వా త పలువురిని వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. కొంపెల్లిలో.. భూపాలపల్లి రూరల్ : మండల పరిధిలోని కొంపెల్లి గ్రామంలో కుక్కల స్వైర విహారంతో పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం పాలేరుగా సాదా యాదగిరి పనుల నిమిత్తం వెళ్తుండగా గ్రామంలో పిచ్చికుక్కలు దాడి చేశాయి. దీంతో యాదగిరి కాలుకు గాయమైంది. కుటుంబసభ్యులు చికిత్స కోసం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత వారం రోజులుగా కుక్కలు గ్రామంలో గుంపులు, గుంపులుగా తిరుగుతూ కరుస్తున్నాయని, వారంలో కుక్కలకాటుకు పిట్టల కొమురక్క, కాసగాని సదయ్య, దన్నాడ నారాయణరెడ్డితో పాటు సుమారు 20 మందికి గాయాలై చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు గ్రామంలో పర్యటించి కుక్కల బాధనుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. -
ఆడుకుంటున్న చిన్నారులపై పిచ్చికుక్క దాడి
కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 18వ వార్డులో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సాయంత్ర సమయంలో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులపై దాడి చేసింది. ఇందులో ఒక బాలుడికి ముఖం నిండా తీవ్ర గాయాలయ్యాయి. 18వవార్డు ఎల్లమ్మవీధికి చెందిన పలువురు చిన్నారులు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు స్కూలు నుంచి వచ్చి ఆడుకునేందుకు పార్కు వద్దకు చేరుకున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన పిచ్చికుక్క వీరిపై అమాంతం విరుచుకుపడింది. పురుషోత్తపురానికి చెందిన తలగాన రోహిత్ ముఖంపై తీవ్ర గాయాలు చేసింది. నుదురు, పెదవులపై దాడి చేసింది. పలాస కాపు వీధికి చెందిన డబ్బీరు ధనుకు చేతి ముక్క పీకేసింది. ధను అన్నయ్య డబ్బీరు దుష్యంత్‌పై దాడి చేసినా స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. వీరితో పాటు సాయమ్మ, రోహిణి, హేమసుందర్ బెహరాకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లారు. కుక్కకాటు సంబంధించిన వ్యాక్సిన్ ఆస్పత్రిలో లేకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు వైద్యులు కూడా లేకపోవడంతో శ్రీకాకుళం వెళ్లి వైద్యం చేయించుకోవాలని సిబ్బంది సూచించారు. రోహిత్ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో తల్లిదండ్రులు గంగాధర్, స్వాతి వెంటనే శ్రీకాకుళం తీసుకెళ్లారు. వ్యాక్సిన్ లేకపోవడంతో కొందరు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోయారు. మరికొందరు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీలో కుక్కలు అధికంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కుక్కల నిర్మూలనకు రూ.4లక్షలు ఖర్చు చూపించినా దస్త్రాలకే పరిమితం అయ్యాయి. -
పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు
నలుగురిని హైదరాబాద్‌కు తరలింపు తాండూరు టౌన్: తాండూరులో ఆదివారం పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 22 మందిపై దాడి చేసి గాయపర్చాయి. స్థానికులు కుక్కలను తరిమేందుకు యత్నించగా వారినీ వదలలేదు. ఒక మహిళ వేసుకున్న స్వెట్టర్‌ను పట్టుకుని రోడ్డుపై లాక్కుంటూ కొద్దిదూరం వరకు తీసుకెళ్లాయి. గాయపడిన వారిని తాండూరు ఆస్పత్రిలో చేర్పించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. అయితే, తాండూరులోని వంతెన సమీపంలో కొందరు వేస్తున్న జంతు కళేబరాలను తిన్న కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.